ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-17T23:37:33+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అజ్మల్ అహ్మది ఆ దేశం

ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అజ్మల్ అహ్మది ఆ దేశం నుంచి పారిపోయిన దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార మార్పిడి ప్రణాళిక లేకుండా ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఘనీని తాను క్షమించలేనని చెప్పారు. ఆఫ్ఘన్ నాయకత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేకపోవడం తనను బాధించిందన్నారు. ఆఫ్ఘన్ నాయకత్వం ఇతరులెవరికీ చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోతుండటం తాను విమానాశ్రయంలో చూశానని పేర్కొన్నారు. 


అహ్మది ట్విటర్ వేదికగా తన ఆవేదనను వెల్లడించారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నదీ చెప్పలేదు. తాను సైనిక విమానంలో వెళ్తున్నట్లు మాత్రమే తెలిపారు. తాను ఓ కమర్షియల్ విమానంలో టిక్కెట్ బుక్ చేసుకున్నానని, అయితే ఆ విమానంలో ప్రయాణికులు మితిమీరి ఉండటంతో తాను ఏదో సైనిక విమానంలో ప్రయాణించానని తెలిపారు. విమానాశ్రయం టార్మాక్ వద్ద విపరీతమైన అరాచక పరిస్థితుల్లో సైనిక విమానంలోకి తనను తన సహచరులు తోశారని చెప్పారు. ఆ సమయంలో తుపాకీ కాల్పులు కూడా వినిపించాయన్నారు. 


ఆదివారం తాను బ్యాంకులో పని ప్రారంభించానని, ఉదయం వెలువడిన వార్తలు తనకు ఆందోళన కలిగించాయని తెలిపారు. తాను అధికారులు, సిబ్బందిని వదిలిపెట్టి వచ్చేశాన్నారు. వీరందరినీ వదిలిపెట్టి వెళ్తుండటం తనకు బాధకలిగించిందన్నారు. ఆఫ్ఘన్ నాయకత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రవర్తించిందన్నారు. వారు ఇతరులెవరికీ చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోతుండటం తాను విమానాశ్రయంలో చూశానని తెలిపారు. అష్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. 


అష్రఫ్ ఘనీకి ప్రణాళిక లేదని, తన సలహాదారుల లోపాలను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం దెబ్బతినడానికి ఇదే కారణమని చెప్పారు. దేశాధ్యక్షుడు దేశం విడిచి వెళ్తున్నట్లు వెల్లడికావడంతోనే మరికొద్ది సేపట్లో అరాచకం ప్రబలుతుందని తనకు తెలుసునన్నారు. అధికార మార్పిడి ప్రణాళిక లేకుండా ఇలాంటి పరిస్థితిని సృష్టించిన ఘనీని తాను క్షమించలేనన్నారు. ఆయనకు గొప్ప ఆలోచనలు ఉన్నాయని, కానీ వాటిని అమలు చేయలేకపోయారని అన్నారు. అందులో తన పాత్ర కూడా ఉండి ఉంటే నిందారోపణల్లో తన వాటాను తాను తీసుకుంటానన్నారు. 


ఆఫ్ఘన్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యంత వేగంగా తమ పదవులను వదిలిపెట్టడం అనుమానాస్పదంగా ఉందన్నారు. దీనిని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. బయటికి తెలియనిదేదో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-08-17T23:37:33+05:30 IST