ఆఫ్ఘనిస్థాన్ పాపులర్ కమెడియన్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-07-23T22:37:48+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో హింసాత్మక సంఘటనలకు హద్దుల్లేకుండా

ఆఫ్ఘనిస్థాన్ పాపులర్ కమెడియన్ దారుణ హత్య

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో హింసాత్మక సంఘటనలకు హద్దుల్లేకుండా పోతున్నాయి. తాజాగా గుర్తు తెలియని దుండగులు ప్రముఖ కమెడియన్‌ను కాందహార్‌లో కాల్చి చంపేశారు. ఆయనను ఇంటి వద్ద నుంచి తీసుకెళ్ళి హత్య చేసినట్లు ఆఫ్ఘనిస్థాన్ మీడియా తెలిపింది. తాలిబన్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు తెలిపింది. అయితే ఈ సంఘటనతో తమకు సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారని పేర్కొంది. 


ఆఫ్ఘనిస్థాన్ మీడియా శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం కొందరు గుర్తు తెలియని సాయుధులు ప్రముఖ కమెడియన్ నాజర్ మహమ్మద్ వురపు ఖాషా జ్వాన్‌ను ఆయన ఇంటి నుంచి తీసుకెళ్ళి, గురువారం-శుక్రవారం మధ్య రాత్రి హత్య చేశారు. తాలిబన్లే ఆయనను హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్యతో తమకు సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. 


అంతకుముందు ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా సైన్యం కోసం అనువాదకునిగా పని చేసిన సొహయిల్ పర్దిస్‌ను తాలిబన్లు హత్య చేశారు. అమెరికా సైన్యం కోసం వందలాది మంది ఆఫ్ఘన్లు అనువాదకులుగా పని చేశారని, ఇప్పుడు వారిని తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. 


ఆఫ్ఘనిస్థాన్ నుంచి విదేశీ సైన్యాలు వెనుకకు వెళ్లిన నేపథ్యంలో తాలిబన్లు గురువారం ఓ ప్రకటనలో తాము 90 శాతం ఆఫ్ఘన్ సరిహద్దులపై పట్టు సాధించామని తెలిపారు. దీనిపై శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తాలిబన్ల ప్రకటన పూర్తిగా అబద్ధమని తెలిపింది.


Updated Date - 2021-07-23T22:37:48+05:30 IST