అఫ్గానిస్థాన్‌లో కీలక మార్పు.. అధ్యక్షుడి సంచలన నిర్ణయం..?

ABN , First Publish Date - 2021-08-14T21:02:34+05:30 IST

అఫ్గాన్ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమయ్యారని సమాచారం.

అఫ్గానిస్థాన్‌లో కీలక మార్పు..  అధ్యక్షుడి సంచలన నిర్ణయం..?

కాబూల్: రోజులు గడుస్తున్న కొద్దీ అఫ్గానిస్థాన్ క్రమక్రమంగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. పరిస్థితి తమ చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం కూడా తాలిబన్లతో రాజీకి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం యత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు విస్తృతంగా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా.. అఫ్గాన్ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమయ్యారని సమాచారం. నేడు జాతిని ఉద్దేశించి అష్రాఫ్ ఘానీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. అంతేకాకుండా.. రాజీనామా చేసిన అనంతరం..ఆయన తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపెట్టివెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారట. అయితే..అధ్యక్షుడి నిర్ణయం పట్ల ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ అసంతృప్తితో ఉన్నారు. 


మరోవైపు..అఫ్గానిస్థాన్‌లో పలు కీలక నగరాల్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మెల్లమెల్లగా దేశరాజధాని కాబుల్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వారు కాబూల్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. త్వరలోనే వారు రాజధానిపై విరుచుకుపడతారని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అధ్యక్షుడు ఘానీ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘యుద్ధం కారణంగా జరుగుతున్న ప్రజల వలసలను నిరోధిస్తాం. రక్తపాతం జరగనివ్వను’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-08-14T21:02:34+05:30 IST