ఆఫ్రికన్‌ మృతి కేసులో సీఐడీ దర్యాప్తు ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-04T16:36:18+05:30 IST

నియోజకవర్గంలోని జేసీ నగర్‌ పోలీసుల కస్టడీలో కాంగో దేశ నివాసి జోయెల్‌ షిందాని (27) మృతి చెందిన ఘటనపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి చేసిన అధి

ఆఫ్రికన్‌ మృతి కేసులో సీఐడీ దర్యాప్తు ప్రారంభం

   - పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురు అరెస్టు 


హెబ్బాళ్‌(కర్ణాటక): నియోజకవర్గంలోని జేసీ నగర్‌ పోలీసుల కస్టడీలో కాంగో దేశ నివాసి జోయెల్‌ షిందాని (27) మృతి చెందిన ఘటనపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు కాంగోదేశ రాయబార కార్యాలయానికి మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారు. సీఐడీ ఎస్పీ వెంకటేశ్‌ నాయకత్వంలో అధికారులు మంగళవారం ఆఫ్రికా నివాసి చికిత్స పొందిన ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. అందులో గుండెపోటుతోనే మృతి చెందినట్టు గుర్తించారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ నియమాల ప్రకారమే పోస్టుమార్టం నిర్వహించారని, ఇద్దరు వైద్యులు, మెజిస్ట్రేట్‌ సమక్షంలోనే జరిగిందని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, వీడియోల ఆధారంగా మొత్తం ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను, వాస్తవాలను గుర్తించే పనిలో పడ్డారు. కాగా జేసీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సోమవారం నిరసన సమయంలో పోలీసులపై దాడికి పాల్పడిన ఆరుగురు ఆఫ్రికన్లపై పలు సెక్షన్‌ల కింద కేసు దాఖలైనట్టు డీసీపీ ధర్మేంద్రకుమార్‌ ప్రకటించారు. అరెస్టయిన ఆఫ్రికా వాసులను బమా అర్మాన్‌ గ్వాయ్‌, క్లెమెంట్‌ బార్కెమెడా, యూసుఫ్‌ మకీటా, జువానెముకుంజు, గులోర్గ్‌గా గుర్తించారు. విద్యార్థుల వీసాపై భారతదేశానికి వచ్చినట్టు గుర్తించామన్నారు. పోలీసులపై దాడి జరిపిన కేసులో ఒక మహిళతో సహా మరికొందరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-08-04T16:36:18+05:30 IST