19 ఏళ్లు కోమాలోకి వెళ్లి.. బయటకు వచ్చాక...

ABN , First Publish Date - 2020-12-06T05:46:03+05:30 IST

చదువుకునే రోజుల్లోనే ఓ ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లిన ఓ కుర్రాడు 19 ఏళ్ల తర్వాత మళ్లీ స్ఫృహలోకి వచ్చి తన జీవితాన్ని ఎలా సాగించాడు..

19 ఏళ్లు కోమాలోకి వెళ్లి.. బయటకు వచ్చాక...

చదువుకునే రోజుల్లోనే ఓ ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లిన ఓ కుర్రాడు 19 ఏళ్ల తర్వాత మళ్లీ స్ఫృహలోకి వచ్చి  తన జీవితాన్ని ఎలా సాగించాడు... ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘కోమాలి’. జయం రవి, కాజల్‌, సంయుక్త హెగ్డే నటించిన ఈ చిత్రానికి ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం జీ5 ఓటీటీ ద్వారా తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమా కథేంటో చూద్దాం... 


   వి నీతి నిజాయతీలతో పెరిగిన  కుర్రాడు. విలువలతోపాటు ప్రతి ఒక్కరితో గౌరవంగా మెలగడం, న్యాయంగా వ్యవహరించడం తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నాడు. 1999 సమయం అది. చదువుకుంటున్న రోజుల్లోనే తన స్నేహితురాలు నికితను ప్రేమిస్తాడు. మంచి సమయం చూసి తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాలనుకుంటాడు. అయితే  పలు కారణాల వల్ల చెప్పలేకపోతాడు. 1999 డిసెంబర్‌ 31న ధైర్యంగా మరో ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ప్రతినాయకుడు ధర్మరాజ్‌ సన్నివేశంలోకి ప్రవేశించి, గ్యాంగ్‌ స్టర్‌ గాజాను హతమారుస్తాడు.  ప్రమాదంలో ఉన్న నికితను రక్షించడానికి రవి ప్రయత్నించగా ఓ ట్రక్కు అతడిని ఢీ కొడుతుంది. దాంతో రవి కోమాలోకి వెళ్ళిపోతాడు. 


 19 ఏళ్ల తర్వాత రవి కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే అతని తండ్రి మరణిస్తాడు. సోదరి స్నేహితుడు మణిని వివాహం చేసుకుంటుంది. 19 ఏళ్లలో రవి కోల్పోయిన క్షణాల్ని, కోరికల్ని తీర్చగలిగితే అతను  మళ్లీ మామూలు మనిషి అవుతాడనీ, లేదంటే డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుందనీ, ఆ సమయంలో అతను ఏదైనా చేయవచ్చనీ  వైద్యులు చెబుతారు. స్నేహిడుతు, రవి సోదరి భర్త మణి రవిని మామూలు మనిషిని చేయడానికి పూనుకుంటాడు. అందులో భాగంగా మొదట రవిని నికిత ఇంటికి తీసుకెళ్తాడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయిపోతుంది. ఆమెను పెళ్లాడింది ఎవరో కాదు రవికి వైద్యం చేసిన డాక్టరే. అయితే తన భర్తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రవి అంటే తనకు ఇష్టం లేదని నికిత చెబుతుంది.రవి నిరాశతో వెనుదిరుగుతాడు. 


ఓ మాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా రవికి రితిక పరిచయమవుతుంది. ఆమెపై మనసు పడ్డ రవి ఆమెను ఓసారి కలవాలనుకుంటాడు. రితిక అనుమతితో సెల్ఫీ తీసుకుని, ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అతని ప్రవర్తన నచ్చక రితిక  నడిరోడ్డు మీద చెంప దెబ్బ కొడుతుంది. దానితో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రితిక పనిచేేస మ్యూజియంలో సెక్యూరిటీ గార్డు చేరతాడు రవి. అతని అమాయకత్వం తెలుసుకున్న రితిక అతడిని క్షమిస్తుంది. 19 ఏళ్లుగా కోమాలో ఉన్న రవి తనని తానూ సమాజానికి పరిచయం చేసుకోవడానికి యూట్యూబ్‌ను ఆయుధంగా ఉపయోగిస్తాడు. అదే సమయంలో ధర్మరాజు మళ్లీ తెరపైకి వస్తాడు. అతనితోపాటు ఓ విగ్రహానికి సంబంధించిన సమస్య కూడా తెరపైకి వస్తుంది. ఆ విగ్రహానికి, ఈ కథకు సంబంధం ఏంటి? రవి కథ ఎలా సుఖాంతం  అయింది అన్నది తెరపైనే చూడాలి.

Updated Date - 2020-12-06T05:46:03+05:30 IST