కోలుకున్న 3 నెలల తర్వాతే టీకామొదటి, రెండో, ముందు జాగ్రత్త డోసుకూ వర్తింపు

ABN , First Publish Date - 2022-01-23T07:31:52+05:30 IST

కొత్త వేరియంట్‌తో అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున వైర్‌సకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చినవారి విషయంలో.. ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్‌ ఇవ్వాలనే అంశమై సందేహాలు..

కోలుకున్న 3 నెలల తర్వాతే టీకామొదటి, రెండో, ముందు జాగ్రత్త డోసుకూ వర్తింపు

న్యూఢిల్లీ/బెంగళూరు, జనవరి 22: కొత్త వేరియంట్‌తో అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున వైర్‌సకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చినవారి విషయంలో.. ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్‌ ఇవ్వాలనే అంశమై సందేహాలు వస్తున్నాయి. ముందుజాగ్రత్త డోసు నిర్వహణకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అ భ్యర్థనలు రావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైరస్‌ బారినపడి కోలుకున్నవారికి మూడు నెలల అనంతరం టీకా ఇవ్వాలని స్పష్టత ఇచ్చింది. మొదటి, రెండో డోసు సహా ముందుజాగ్రత్త డోసుకూ ఇదే సూచన వర్తిస్తుందని పేర్కొంది. జాతీయ సాంకేతిక టాస్క్‌ఫోర్స్‌ ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు/యూటీలకు కేంద్రం లేఖలు పంపింది.


21లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 3.47 లక్షల కేసులు రాగా.. శుక్రవారం 3,37,704 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 488 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 21.13 లక్షలకు పెరిగాయి. కేంద్రం సూచనల నేపథ్యంలో రాష్ట్రాల్లో పరీక్షలు పెరుగుతున్నాయి. శుక్రవారం 19.60 లక్షల టెస్టులు చేశారు. కేరళ తిరువనంతపురంలోని పూజప్పుర సెంట్రల్‌ జైలులో 262 మంది ఖైదీలకు పాజిటివ్‌ వచ్చింది. కన్నూర్‌ సెంట్రల్‌ జైలులో 10 మంది ఖైదీలకు వైరస్‌ సోకింది. గుజరాత్‌లోని మరో 17 పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ పిల్లలపై పెద్దగా ప్రభావం లేదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. తేలికపాటి ఇన్ఫెక్షన్లే ఉండటంతో 90 శాతం మంది పిల్లలు ఔట్‌ పేషెంట్‌ (ఓపీ)కే పరిమితమవుతుండగా, కేవలం 10 శాతం మంది బాలలను చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇక.. మూడోవేవ్‌లో సంభవించిన కొవిడ్‌ మరణాల్లో 60 శాతం పూర్తిగా/పాక్షికంగా టీకా తీసుకోని వారివేనని మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ వైద్యసంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. మృతుల్లో ఎక్కువ మంది 70 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారని పేర్కొంది. మరోవైపు.. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(88)కు మరోమారు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, ఒమైక్రాన్‌ ఉపవర్గానికే చెందిన ‘బీఏ.2’ అనే వేరియంట్‌ బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించిన 426 కేసులను బ్రిటన్‌ ప్రభుత్వ ఆరోగ్య భద్రతా సంస్థ గుర్తించింది. ఈనేపథ్యంలో బీఏ.2ను ‘వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌’గా ప్రకటించింది. 

Updated Date - 2022-01-23T07:31:52+05:30 IST