బాబా రామ్‌దేవ్ యూటర్న్.. అల్లోపతిపై పొగడ్తలు, టీకా తీసుకుంటానని ప్రకటన

ABN , First Publish Date - 2021-06-11T21:33:52+05:30 IST

యోగా గురు బాబా రామ్‌దేవ్ వ్యాక్సిన్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకు అల్లోపతి

బాబా రామ్‌దేవ్ యూటర్న్.. అల్లోపతిపై పొగడ్తలు, టీకా తీసుకుంటానని ప్రకటన

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్ వ్యాక్సిన్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకు అల్లోపతి వైద్యంపై తీవ్ర ఆరోపణలు చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహానికి గురైన రామ్‌దేవ్ బాబా ఇప్పుడు అల్లోపతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైద్యులు ఈ భూమిపై నడిచే దేవదూతలని కొనియాడారు. తాను కూడా త్వరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని, కరోనా వల్ల ఏ ఒక్కరు చనిపోకూడదని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత యోగా, ఆయుర్వేదం వల్ల మరింత రెట్టింపు రక్షణ లభిస్తుందని బాబా రామ్‌దేవ్ అన్నారు. ‘త్వరలోనే’ తాను కూడా టీకా తీసుకుంటానని పేర్కొన్నారు. 


అత్యవసర చికిత్సకు సర్జరీ, అల్లోపతి అద్భుతంగా పనిచేస్తాయని బాబా పేర్కొన్నారు. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదని తేల్చి చెప్పారు. కాగా, గతంలో బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను టీకా వేయించుకోబోనని తేల్చి చెప్పారు. తనకు యోగా, ఆయుర్వేద రక్షణ ఉందని చెప్పుకొచ్చారు. అంతలోనే ఇప్పుడు వైద్యులను దేవదూతలుగా, అల్లోపతిని అద్భుత ఔషధంగా పేర్కొనడం గమనార్హం. 


సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా వ్యాక్సిన్ వేయించుకోబోనని తేల్చి చెప్పారు. అది ‘బీజేపీ వ్యాక్సిన్’ అని విమర్శించారు. ఇప్పుడాయన కూడా యూటర్న్ తీసుకుని టీకా తీసుకుంటానని మంగళవారం ప్రకటించారు. అఖిలేష్ తండ్రి ములాయంసింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకోవడంతో అఖిలేశ్ మనసు మార్చుకుని తాను కూడా వ్యాక్సిన్ వేయించుకుంటానని ప్రకటించారు. తాను త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకుంటానని, వ్యాక్సిన్ల కొరత కాకుండా ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు కూడా వెంటనే వేయించుకోవాలని కోరారు. 



Updated Date - 2021-06-11T21:33:52+05:30 IST