ఏడాది తర్వాత.. 35 వేల నియామకాలకు చర్యలు

ABN , First Publish Date - 2020-08-05T07:40:53+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసిన ఏడాది తర్వాత ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించింది. 35 వేల పోస్టుల భర్తీకి చర్యలు

ఏడాది తర్వాత.. 35 వేల నియామకాలకు చర్యలు

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసిన ఏడాది తర్వాత ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించింది. 35 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో డాక్టర్లు, పశువైద్యులు, పంచాయతీ అసిస్టెంట్లకు సంబంధించి 10వేల పోస్టులు ఉన్నాయి.


20 వేల మంది శరణార్థులకు సాంత్వన

ఈ ఏడాది కాలంలో 20 వేల మంది శరణార్థులకు డొమిసైల్‌ హోదాతో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన వారేనని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.5.50 లక్షల చొప్పున సాయం చేశామని, విద్య, ఉద్యోగాల్లో హక్కులుంటాయన్నారు.


కశ్మీర్‌ వ్యాప్తంగా భారీ భద్రత

ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసి బుధవారానికి ఏడాది కావడంతో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగే అవకాశమున్నందున కీలక ప్రాంతాలు, హైవేల్లో పారామిలటరీ దళాలను మోహరించారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు కూడా విద్రోహ చర్యలకు పాల్పడే ప్రమాదాలున్నందున సైన్యం అప్రమత్తమైంది. ‘ఆగస్టు 5’ను పాకిస్థాన్‌ ‘బ్లాక్‌ డే’గా ప్రకటించినందున సరిహద్దు వెంట నిఘాను పెంచింది.


పెట్టుబడులపై కరోనా దెబ్బ?

కశ్మీర్‌ లోయలో మొత్తం 57 పారిశ్రామిక వాడలు ఉండగా జనవరిలో 41 కంపెనీలు రూ.15 వేల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. అయితే.. అనూహ్యంగా కరోనా కల్లోలంతో ఆ ప్రతిపాదనలకు బ్రేకులు పడ్డాయి. 


లద్దాఖ్‌ విద్యార్థులకు 4% కోటా

లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో 4ు సీట్లు రిజర్వ్‌ చేస్తున్నట్టు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది. చీఫ్‌సెక్రటరీ బీవీఆర్‌ సుబ్రమణ్యం నేతృత్వంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లద్దాఖ్‌లో వృత్తివిద్యా సంస్థలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Updated Date - 2020-08-05T07:40:53+05:30 IST