‘పదవి’ ఫార్ములాతో సెట్ చేసుకొస్తున్న Congress

ABN , First Publish Date - 2021-07-25T16:52:29+05:30 IST

కొన్ని రోజులుగా రాజస్థాన్ వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యమంత్రి గెహ్లోత్, యువ నేత సచిన్ పైలట్

‘పదవి’ ఫార్ములాతో సెట్ చేసుకొస్తున్న Congress

న్యూఢిల్లీ :  కొన్ని రోజులుగా రాజస్థాన్ వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యమంత్రి గెహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఇంతలోనే పంజాబ్ వ్యవహారమూ తెరపైకి వచ్చింది. కొన్ని రోజుల క్రిందటే పంజాబ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పెద్దలు ‘సెట్’ చేశారు. ఫైర్ బ్రాండ్ సిద్దూకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పారు. ఇప్పుడు రాజస్థాన్ వ్యవహారాన్ని కూడా ‘సెట్’ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ అజయ్ మాకెన్ పంజాబ్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరితో సమావేశం కూడా కానున్నారు. అయితే శనివారం సీఎం గెహ్లోత్ ఇచ్చిన విందుకు వీరిద్దరూ హాజరయ్యారు. విందుతో పాటు రాజకీయాలను కూడా చర్చించుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ సాగింది.


అయితే మంత్రివర్గ విస్తరణను చేయడం ద్వారా సీఎం, పైలట్ మధ్య నెలకొన్న ‘గ్యాప్’ ను పూరించాలని అదిష్ఠానం డిసైడ్ అయ్యింది. సీఎంతో భేటీ అయిన తర్వాత అధిష్ఠానం పెద్దలు సచిన్ పైలట్ వర్గీయులతో కూడా భేటీ అయ్యారు. అయితే ఏది ఏమైనా చివరి నిర్ణయాన్ని మాత్రం అధ్యక్షురాలు సోనియా గాంధీకే విడిచిపెట్టనున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులకు కొందరికి ఉద్వాసన చెప్పనున్నారు. వారి స్థానాన్ని పైలట్ వర్గీయులతో భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 27 లేదా 28 న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉంటూ పీసీసీ బాధ్యతల్లో ఉన్న గోవింద్ సింగ్ దోతాస్రాకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో పైలట్ వర్గీయులను కూర్చోబెట్టడానికి అధిష్ఠానం ప్లాన్ సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు. 

Updated Date - 2021-07-25T16:52:29+05:30 IST