Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొన్న తెలంగాణా పేపర్ బాయ్.. ఇప్పుడు అహ్మదాబాద్ కచోరీ బాయ్...

న్యూఢిల్లీ : బాల్యం నుంచి పలువురికి ఆదర్శంగా నిలిచేవారు అనేక మంది కనిపిస్తారు. పేపర్ బాయ్‌గా పని చేసి, రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం వంటివారు ఎందరో ఉన్నారు. అదే విధంగా ఇటీవల తెలంగాణా మంత్రి కే తారక రామారావు ట్వీట్‌తో జై ప్రకాశ్ అనే పన్నెండేళ్ల బాలుడు అందరినీ ఆకట్టుకున్నాడు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో, ఆరోగ్యం కోసం, సమాజంలో ఎదిగే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పేపర్ బాయ్‌గా చేస్తున్నానని చెప్పి ఆకర్షించాడు. బాల్యంలో కష్టపడటం భవిష్యత్తులో మేలు చేస్తుందని ఈ జగిత్యాల కుర్రాడు చెప్పడంతో అందరూ అతనిని ఆశీర్వదిస్తున్నారు. 


ఇటువంటి ఆదర్శప్రాయులైన బాలల జాబితాలోకి అహ్మదాబాద్‌కు చెందిన పద్నాలుగేళ్ళ బాలుడు కూడా చేరాడు. ఆ బాలుడు తన కుటుంబానికి ఆర్థికంగా సాయపడటం కోసం దహీ కచోరీని తయారు చేసి, అందుబాటు ధరకు అమ్ముతున్నాడు. ఈ బాలుడి కథనాన్ని ఫుడ్ బ్లాగర్ దోయాష్ పత్రబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను చూసినవారు ఆ బాలుడిని మెచ్చుకుంటున్నారు. 


గుజరాత్‌లోని మణినగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు పక్కన ఈ బాలుడి దహీ కచోరీ స్టాల్ ఉంది. దోయాష్‌తో మాట్లాడుతున్నపుడు ఆ బాలుడు కన్నీటిపర్యంతమైనట్లు వీడియోలో కనిపించింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తాను దహీ కచోరీ అమ్ముతున్నానని చెప్పాడు. తనకు సాయపడాలని సామాజిక మాధ్యమాల యూజర్లను ఆ బాలుడు కోరాడు. 


ఈ బాలునికి సాయపడాలని దోయాష్ కూడా కోరారు. దహీ కచోరీని కేవలం రూ.10 కే అమ్ముతున్నాడని తెలిపారు. ఆ బాలుడిని చూస్తే గర్వంగా ఉందన్నారు. ఈ వీడియోను షేర్ చేసి, అతనికి సాయపడాలని కోరారు. కుటుంబానికి సాయపడటం కోసం పద్నాలుగేళ్ల వయసులో చాలా శ్రమిస్తున్నాడని తెలిపారు. 


ఈ వీడియో వైరల్ కావడంతో అనేకమంది యూజర్లు ఆ బాలుడిని ప్రశంసిస్తున్నారు. అతనికి మరింత శక్తి లభించాలని ఆశీర్వదిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement