ఉదయం పది గంటలు దాటితే... ఎక్కడి ఇసుక దొంగలు అక్కడే గప్‌చుప్‌

ABN , First Publish Date - 2021-10-28T04:35:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఇసుక బంగారంగా మారింది. సామాన్యులు ఒకటీఅరా ట్రక్‌ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడగా, అక్రమార్కుల దోపిడీకి మాత్రం చక్కని ఆదాయ వనరుగా ఏర్పడింది. పర్యవేక్షణ అధికారుల చేతులు తడిపి ఇసుక అక్రమ తరలింపు ద్వారా అధికార పార్టీ నేతలు లక్షలు దోచుకుంటున్నారు. మడనూరు నుంచి వయా అనంతవరం మీదుగా రోజూ ట్రాక్టర్ల కొద్ది ఇసుక అడ్డూఆపు లేకుండా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.

ఉదయం పది  గంటలు దాటితే...  ఎక్కడి ఇసుక దొంగలు అక్కడే గప్‌చుప్‌
అనంతవరం గ్రామ సచివాలయం మీదుగా తరలిపోతున్న ఇసుక ట్రాక్టర్లు


అనంతవరం సచివాలయం మీదుగా అక్రమ తరలింపు

కొత్తపట్నం మడనూరు పొలాల్లో తవ్వకం

అక్కడ్నుంచి టంగుటూరు వరకు అమ్మకాలు

ఎప్పట్నుంచో సాగుతున్నా పట్టించుకోని  అధికార యంత్రాంగం

గ్రామాల అంతర్గతరోడ్లు కావడంతో తనిఖీలు శూన్యం

అన్ని స్థాయిల్లో అధికారులకు లంచాలు

లక్షలు పోగేసుకుంటున్న అక్రమార్కులు


అనంతవరం(టంగుటూరు), అక్టోబరు 27 : వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఇసుక బంగారంగా మారింది. సామాన్యులు ఒకటీఅరా ట్రక్‌ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడగా, అక్రమార్కుల దోపిడీకి మాత్రం చక్కని ఆదాయ వనరుగా ఏర్పడింది. పర్యవేక్షణ అధికారుల చేతులు తడిపి ఇసుక అక్రమ తరలింపు ద్వారా అధికార పార్టీ నేతలు లక్షలు దోచుకుంటున్నారు. మడనూరు నుంచి వయా అనంతవరం మీదుగా రోజూ ట్రాక్టర్ల కొద్ది ఇసుక అడ్డూఆపు లేకుండా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.


గతంలో ట్రాక్టర్‌ బాడుగ పెట్టుకుంటే చాలు...

ట్రాక్టర్‌ బాడుగ పెట్టుకుంటే చాలు అవసరానికి తగినంత ఇసుక తరలించుకపోవచ్చన్నది గత టీడీపీ ప్రభుత్వం వరకూ ఉన్న పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక తవ్వుకునే స్వేచ్ఛను ప్రజలను హరించివేసింది. ప్రభుత్వం అనుమతితో ఏర్పాటు చేసిన డంప్‌ల నుంచే కొని తీసుకెళ్లాలి. అదీను ప్రభుత్వ నిర్ణయించిన ధర చెల్లించాలి. ఈ అస్తవ్యస్త విధానంతో ఇసుక ధరలు రెండేసి రెట్లు పెరిగాయి. దీంతో ప్రజలు తమ అవసరాలను సైతం వాయిదా వేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు నేడు కొనసాగుతున్నాయి.

 

అక్రమార్కులకు కలిసొచ్చిన ప్రభుత్వ తీరు

రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు కొందరు అక్రమార్కులకు వరంలా మారాయి. అనుమతి లేని ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక తవ్వి లోడ్‌ చేసుకొని ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా, గుట్టుగా తరలిస్తున్నారు. అఽధికారులకు మామూళ్లు ముట్టచెబుతుండడంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోందని ప్రజలు చెబుతున్నారు. అందుకు ఒకేఒక్క అర్హత వైసీపీ గుర్తింపు ఉంటే చాలంటున్నారు. ఈమార్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపుపై అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.


మడనూరు వయా అనంతవరం మీదుగా తరలింపు

కొత్తపట్నం మండలంలోని మడనూరు పొలాల నుంచి సమీప అనంతవరం మీదుగా ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. నిత్యం ట్రాక్టర్ల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తూర్పుతీరానున్న ఈతముక్కల, మడనూరు నుంచి బకింగ్‌హాం కెనాల్‌, ముసి ఏరు దాటితే అనంతవరం గ్రామం వస్తుంది. ఈతముక్కల, మడనూరు నుంచి టంగుటూరు మండలంలోని అనంతవరం గ్రామానికి దూరం కేవలం 5కిమీ మాత్రమే. ఈ మార్గంలో అఽధికారులు, ఇతర ఏ అడ్డంకులూ ఉండవు. అక్రమార్కులు ఇసుక అక్రమ తరలింపునకు ఇదే రాజమార్గంగా ఎంపిక చేసుకున్నారు. మడనూరు పొలాల్లో  తవ్వి లోడ్‌ చేసుకొని అనంతవరం, వెలగపూడి, టంగుటూరు, ఆలకూరపాడు గ్రామాల్లోని అవసరాలకు ఇసుక అమ్ముతున్నారు. నాసిరకం ఇసుక అయినప్పటికీ దొరకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో  వేరే అవకాశం లేక వినియోగదారులు ఈ ఇసుకను ప్లాస్టింగ్‌లు, మేరవలకు వినియోగిస్తున్నారు.


ట్రాక్టర్ల తో గుట్టుచప్పుడు కాకుండా తరలింపు ఇలా... 

ఎప్పట్నుంచో ఈ మార్గంలో ప్రతి నిత్యం పది ఇసుక ట్రాక్టర్లు హోరెత్తిస్తున్నాయి. రోజూ వేకువజాము నుంచి పది గంటలలోపు ఒక్కో ట్రాక్టరు సుమారు మూడు ట్రిపుల లెక్కన ఇసుకను తరలిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడి వారు అక్కడే గప్‌చు్‌పగా ఉంటారు. మళ్లీ మరుసటిరోజు వేకువజాము నుంచే రంగంలోకి దిగుతున్నారు. గుట్టుచప్పుడుగా ఎప్పట్నుంచో సాగుతున్న ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయిలు చేతులుమారుతున్నాయని అంచనా. ఎలాంటి అడ్డంకులు లేని ఈమార్గం అక్రమ వ్యాపారానికి నెలవుగా మారింది. అనంతవరం సచివాలయం మీదుగా ట్రాక్టర్లు తరలిపోవాల్సి ఉండడంతోపాటు ఆ తర్వాత అధికారులు ఎవరైనా వస్తారన్న అనుమానంతో పది గంటలకు గుట్టుగా ముగిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక తరలింపు కొందరు అధికారులకు తెలుసని, వారిపని ముగించుకోని అనుమతిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక తవ్వుకునేందుకు కొత్తపట్నం పోలీసులకు ముడుపులు ముడుతున్నట్లు బహిరంగ ప్రచారం జరుగుతోంది. తేటుపురం, మడనూరు, ఈతముక్కల ట్రాక్టర్లు ఇసుక తరలింపులో పాల్గొంటున్నట్లు సమాచారం.

Updated Date - 2021-10-28T04:35:03+05:30 IST