Abn logo
Sep 26 2021 @ 08:15AM

మూడు నెలల తరువాత మళ్లీ సైకిల్‌పై సీఎం సవారీ..

  - నాలుగు నెలల్లోనే రెండు వందలకుపైగా హామీల అమలు

 - చెప్పింది చేస్తున్నాం: స్టాలిన్‌


చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోపే 200లకు పైగా హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ అన్నాడీఎంకే నేత ఎండప్పాడి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను ఖండిస్తూ స్టాలిన్‌ శనివారం ఓ వీడియో సందేశమిచ్చారు. ఇందులో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, గతంలో ఇచ్చిన హామీలను వల్లెవేశారు. గత శాసనసభ ఎన్నికల్లో 505 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో చెప్పిన హామీలే కాకుండా చెప్పనివాటిని కూడా అమలు చేస్తానని ఆనాడే శపథం చేశానని, ఆ మేరకు ప్రస్తుతం కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. గత మే 7వ తేదీన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే ఐదు కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశానని గుర్తుచేశారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రెండు కోట్లకు పైగా నిరుపేద కార్డుదారులకు రేషన్‌షాపులలో రూ.4వేల సాయం అందజేశామని, ఆవిన్‌ పాల ధరను లీటరుకు రూ.3లు తగ్గించానన్నారు. మహిళలకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం, పాదయాత్రలో ప్రజల నుంచి సేకరించిన వినతిపత్రాల పరిష్కారం కోసం ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు,  ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితుల చికిత్సకయ్యే వ్యయాన్ని బీమా పథకం ద్వారా ప్రభుత్వమే భరించడం వంటివాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇవన్నీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేనన్నారు. ఆ తర్వాత లీటర్‌ పెట్రోలు ధరను రూ.3 తగ్గించామని, రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, సహకార సంఘాల్లో మహిళా స్వయం సహాయక బృందాలు తీసుకున్న రూ.2756 కోట్ల రుణాలను మాఫీ చేశామని, ఒలంపిక్‌ క్రీడల్లో పతకాలు పొందిన క్రీడాకారులకు కోటి నుంచి మూడు కోట్ల దాకా నగదు కానుకలందించామని, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేశామని, నీట్‌ పరీక్షల రద్దుకు న్యాయపోరాటం సాగిస్తున్నామని స్టాలిన్‌ వివరించారు. కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ అసువులు బాసిన వైద్యుల కుటుంబాలకు, కరోనా కారణంగా మృతి చెందిన పోలీసులకు తలా రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించామని, ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను తొమ్మిది నుంచి 12 నెలలకు పెంచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఇవి కాకుండా గవర్నర్‌ ప్రసంగంలో ప్రకటించిన 43 హామీలు, వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకటించిన 23 హామీలు, శాసనసభలో మంత్రులు చేసిన  64 హామీలు, ఆర్థిక పద్దుల సమయంలో ప్రకటించిన 16 హామీలను కూడా నెరవేర్చామని తెలిపారు. 


 స్టాలిన్‌తో యువతీయువకుల సెల్ఫీ

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మూడు నెలల విరామం తర్వాత శనివారం ఉదయం మళ్ళీ సైకిల్‌ సవారీ చేశారు. మార్గమధ్యంలో స్టాలిన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. స్టాలిన్‌ ప్రతివారం శని, ఆదివారాల్లో ఉదయం పూట వ్యాయామం కోసం సైక్లింగ్‌ చేస్తుంటారు. ముఖ్యమంత్రి కాకమునుపు వారాంతపు సెలవుదిన్నాల్లో ఈస్ట్‌కోస్ట్‌రోడ్డులో సైకిల్‌ సవారీ చేసేవారు. గత జూలై నాలుగన ముట్టుకాడు నుంచి మహాబలిపురం వరకూ ఆయన సైకిల్‌ను వేగంగా తొక్కుకుంటూ వెళ్ళారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్టాలిన్‌ నీలిరంగు ఫుల్‌హేండ్‌ షర్టు, అదే రంగు ఫ్యాంట్‌, తలకు హెల్మెట్‌ ధరించి సైకిల్‌ను వేగంగా నడుపుకుంటూ వెళ్ళారు. ముట్టకాడు నుంచి మహాబలిపురం దాకా ఆయన సైకిలు సవారీ చేశారు. ఆయనతోపాటు రోజూ ఆ మార్గంలో సైకిల్‌ సవారీ చేసే కొంతమంది యువకులు కూడా వెళ్ళారు. ఆ యువకులతో స్టాలిన్‌ కబుర్లాడారు. మార్గమధ్యంలో పలు చోట్ల, మహిళలు, యువతీయువకులు, బాలబాలికలు స్టాలిన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడ్డారు. మహాబలిపురం చేరిన తర్వాత స్టాలిన్‌ అక్కడి టీకొట్టుకు వెళ్ళి బల్లపై సాధారణ వ్యక్తిలా కూర్చుని వేడిగా టీ సేవించారు.