కమలా హ్యారిస్‌కూ తప్పని సొంతింటి తిప్పలు..!

ABN , First Publish Date - 2021-03-30T16:54:35+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడుస్తున్న భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌ ఇప్పటికీ అధికారిక నివాసంలో అడుగుపెట్టలేదు.

కమలా హ్యారిస్‌కూ తప్పని సొంతింటి తిప్పలు..!
అధ్యక్షుడి అధికారిక అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడుస్తున్న భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌ ఇప్పటికీ అధికారిక నివాసంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఆమె తన భర్త డగ్లస్ ఎమ్హాఫ్‌తో కలిసి అధ్యక్షుడి అధికారిక అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లోనే ఉంటున్నారు. దీనికి కారణం ఉపాధ్యక్షులకు కేటాయించే అధికారిక నివాసం నావల్ అబ్జర్వేటరీ‌లో మరమ్మతులు జరుగుతుండటమే. అయితే, ఇవి ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. ఇటీవల ప్రముఖ అమెరికన్ ఎజెన్సీ అక్కడి రికార్డులను పరిశీలించగా.. భవనంలో ప్లంబింగ్​, హీటింగ్​, ఎయిర్​ కండీషనింగ్​కు సంబంధించి మరమ్మతులు జరుగుతున్నట్టు గుర్తించింది.  


ఇక వంటలు చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచే కమల మూడు వారాల క్రితం నావల్ అబ్జర్వేటరీ‌ భవనానికి వెళ్లినప్పుడు వంట గదిలో కొన్ని మార్పులు సూచించారని తెలిసింది. కానీ, ఉపాధ్యక్షురాలు సూచించిన మార్పులేవీ ఇప్పటికీ జరగలేదని సమాచారం. ఈ విషయంలో కమల విసుగెత్తుపోతున్నారని.. అధికార నివాసానికి ఎప్పుడు వెళతానన్న ఆలోచన ఆమెలో రోజురోజుకు పెరిగిపోతోందని అధికారిక వర్గాల సమాచారం. ఇలా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలైన కమలాకు సైతం సొంతింటి తిప్పలు తప్పకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-03-30T16:54:35+05:30 IST