అదే శాశ్వతం!

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

ఇహలోకం తాత్కాలికమైనది. మానవుడి అసలు జీవితం మరణానంతరమే మొదలవుతుంది. అదే పరలోక జీవితం. పరలోక సాఫల్య వైపల్యాలు ఇహలోకంలో మనం ఆచరించే కర్మల మీద ఆధారపడి ఉంటాయి...

అదే శాశ్వతం!

ఇహలోకం తాత్కాలికమైనది. మానవుడి అసలు జీవితం మరణానంతరమే మొదలవుతుంది. అదే పరలోక జీవితం. పరలోక సాఫల్య వైపల్యాలు ఇహలోకంలో మనం ఆచరించే కర్మల మీద ఆధారపడి ఉంటాయి. పరలోక సాఫల్యానికి ఇహలోకంలో పాటుపడడం బుద్ధిమంతుడి లక్షణం.

‘‘ఇహలోకంలో మీకు ఇచ్చిన జీవన సామగ్రి మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. దేవుని దగ్గర ఉన్నదే శ్రేష్టమైనదీ, శాశ్వతమైనదీ! అయితే సత్యాన్ని విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారికే ఇది లభిస్తుంది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. 

ఒకసారి దైవ ప్రవక్త మహమ్మద్‌ బజారులో వెళ్తున్నారు. ఆయనకు దారిలో పొట్టి చెవులున్న ఒక మేక పిల్ల చచ్చి పడి ఉండడం కనిపించింది. అక్కడ ఉన్న వారితో ‘‘మీలో ఎవరైనా దీన్ని ఒక దిర్హమ్‌కు కొనడానికి ఇష్టపడతారా?’’ అని ఆయన అడిగారు. 

‘‘ఒక దిర్హమ్‌కు కాదు కదా అంతకన్నా తక్కువ ఖరీదుకైనా తీసుకోం. ఒకవేళ దాన్ని తీసుకున్నా మేమేం చేసుకుంటాం?’’ అన్నారు వారు.

‘‘ఉచితంగా లభిస్తే తీసుకుంటారా? అని మళ్ళీ అడిగారు దైవప్రవక్త. 

‘‘ఇది బతికున్నా దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. అయినా చచ్చిపోయిన దాన్ని మేమేం చేసుకుంటాం?’’ అన్నారు వారు. 

అప్పుడు ఆయన ‘‘దైవసాక్షి! మీరు ఈ మేక పిల్లను ఎంత తుచ్ఛమైనదిగా భావిస్తున్నారో, దేవుడి దృష్టిలో ఈ లోకం అంతకన్నా తుచ్ఛమైనది’’ అని చెప్పారు. (హదీస్‌ గ్రంథం)

‘‘ప్రపంచాన్ని ప్రేమించేవాడు తన పరలోకాన్ని నాశనం చేసుకుంటాడు. పరలోకాన్ని ప్రేమించేవాడు తన ప్రపంచాన్ని నష్టపరుచుకుంటాడు. కాబట్టి ఓ ప్రజలారా! అంతమైపోయే ఈ (ఐహిక) జీవితం కన్నా శాశ్వతంగా ఉండే (పరలోక) జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి’’ అని హదీస్‌ గ్రంథం (మిష్కాత్‌) సందేశం ఇస్తోంది.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST