మరోసారి ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్..

ABN , First Publish Date - 2020-10-13T01:24:45+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు.

మరోసారి ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్..

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళవారం లేదా బుధవారం నాడు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీల అపాయిట్మెంట్‌ను జగన్ కోరారు. అయితే అపాయిట్మెంట్ ఖరారైందని ఇంకా పీఎంవో ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వారం రోజుల్లో రెండోసారి ప్రధాని అపాయిట్మెంట్‌ను సీఎం జగన్ కోరడంపై రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు..? వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి..? రాష్ట్రపతి, ప్రధానిని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఆ ఇద్దర్నీ కలిసి జగన్ ఏం చర్చించబోతున్నారు..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే జగనే ఢిల్లీ వెళ్తున్నారా..? అనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.


ఏం చర్చిస్తారో..!?

అయితే.. ఈ భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలు, రాజకీయ విషయాలపై ప్రధాని, రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని, రాష్ట్రపతితో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విషయమై ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ చర్చిస్తారని తెలుస్తోంది.


సంచలన ఆరోపణలు

కాగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ ఆరోపణలపై పలువురు న్యాయ నిపుణులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఇది న్యాయ వ్యవస్థను భయోత్పాతానికి గురి చేసే ప్రయత్నం’ అని కొందరు పెద్దలు అంటుండగా.. మరికొందరు చీఫ్‌ జస్టి్‌స్‌కు ముఖ్యమంత్రి లేఖ రాయడం... దాంతోపాటు జత చేసిన పత్రాలను మీడియాకు విడుదల చేయడం వెనుక కచ్చితంగా తప్పుడు ఉద్దేశాలున్నాయని చెబుతున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయడమంటే.. ప్రశాంత్‌ భూషణ్‌ కేసులో సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. 


అనుమానాలు..

నేర నేతలపై కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటున్న సమయంలోనే.. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా‌స్‌తోపాటు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులపై ఏసీబీ కేసు పెట్టడం.. ఆపై ముఖ్యమంత్రి సుప్రీం సీజేకు లేఖ రాయడం, ఆ పత్రాలన్నీ బయటపెట్టడం వంటి చర్యలతో ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

Updated Date - 2020-10-13T01:24:45+05:30 IST