అధికార TRS పార్టీలో కుమ్ములాటలు.. నే‘తలో’ దారి.. మళ్లీ తలనొప్పి..!

ABN , First Publish Date - 2021-11-03T17:16:48+05:30 IST

అధికార TRS పార్టీలో కుమ్ములాటలు.. నే‘తలో’ దారి.. మళ్లీ తలనొప్పి..!

అధికార TRS పార్టీలో కుమ్ములాటలు.. నే‘తలో’ దారి.. మళ్లీ తలనొప్పి..!

  • శివారు కార్పొరేషన్లలో వైరాలు
  • వర్గాలుగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు
  • పరస్పరం ఫిర్యాదులు.. సొంత పార్టీ నుంచే విమర్శలు

హైదరాబాద్‌ సిటీ : శివారు కార్పొరేషన్లలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల మధ్య రోజురోజుకూ అగాధం పెరుగుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్లే కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కౌన్సిల్‌ సమావేశాల్లో నిలదీస్తూ మేయర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.


నగర శివార్లలోని బండగ్‌పేట, మీర్‌పేట, నిజాంపేట, బండ్లగూడ జాగీర్‌, జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లు ఉండగా, అన్ని కార్పొరేషన్ల మేయర్లుగా టీఆర్‌ఎస్‌ వారే ఉన్నారు. బడంగ్‌పేట మినహా మిగతా చోట్ల డిప్యూటీ మేయర్లంతా టీఆర్‌ఎస్‌ వారే. తొలిరోజుల్లో అధికార పార్టీ నేతలంతా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆరు నెలలకే వారి మధ్య తేడాలొచ్చాయి. వాటాల విషయంలో కొందరు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల మధ్య విభేదాలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతల మధ్యే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.


ఫిర్యాదుల‘గూడ’..

ఫిర్జాదీగూడ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుత పాలకమండలి ఆధ్వర్యంలో రెండు విడతలుగా జరిగిన హరితహారంలో రూ. కోట్ల అవినీతి జరిగిందని అధికార పార్టీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మేడ్చల్‌ కలెక్టర్‌తో పాటు, సీడీఎంఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు తొమ్మిది మంది అధికార పార్టీ కార్పొరేటర్లు పాలకమండలి చర్యలపై  విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. ఇక్కడి మేయర్‌, డిప్యూటీ మేయర్ల తీరుపై గుర్రుగా ఉన్న వీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మీర్‌పేటలో స్ట్రీట్‌ ఫైట్‌..

మీర్‌పేట కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్ల మధ్య దూరం పెరుగుతోంది. అధికార పార్టీ కార్పొరేటర్లను కలుపుకొని వెళ్లడం లేదనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. తమకు సమాచారం లేకుండా తమ డివిజన్లలో పర్యటిస్తున్నారని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కార్పొరేటర్లు దాడులు సైతం చేసుకోవడంతోపాటు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరూ కార్పొరేటర్లు సైతం మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. 


నిజాంపేట, బండ్లగూడ జాగీర్‌లోనూ..

నిజాంపేట కార్పొరేషన్‌లో అధికార పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్ల మధ్య పలు సందర్భాల్లో భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. కౌన్సిల్‌ సమావేశాల్లో అభివృద్ధి పనుల విషయంలో బహిరంగంగానే విమర్శలు చేయడం గమనార్హం. బండ్లగూడలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో అధికార పార్టీ కార్పొరేటర్లు రెండుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-11-03T17:16:48+05:30 IST