తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-05-23T03:12:54+05:30 IST

తెలంగాణలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ..

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు!

హైదరాబాద్ ‌: తెలంగాణలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వారంలో రెండు మూడ్రోజులు కేసులు తగ్గడం మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయ్. దీంతో ప్రజలు.. మరీ ముఖ్యంగా నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం నాడు కొత్తగా 62 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1761కి చేరుకుంది. ఇవాళ హైదరాబాద్‌లో 42 కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డిలో ఒక్క కేసు నమోదయ్యింది. మరోవైపు వలస కార్మికుల్లో 12 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవాళ కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 48కి చేరింది.


కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 118 మంది వలసకార్మికులకు కరోనా సోకింది. ఇవాళ ఒక్కరోజే ఏడుగురు డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1,043కి చేరుకుంది. ఆసుపత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తానికి చూస్తే.. ఒకరోజు కేసులు భారీగా తగ్గిపోవడం.. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడటం గమనార్హం. మరోవైపు.. లాక్ డౌన్‌ 4.0 సడలింపులు ఇచ్చిన తర్వాత ఇలా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.

Updated Date - 2020-05-23T03:12:54+05:30 IST