మళ్లీ మొదటికి...

ABN , First Publish Date - 2022-01-18T07:27:33+05:30 IST

కొవిడ్‌ టెస్టులుచేయించుకోవడానికి వచ్చే అనుమానితుల సంఖ్య సోమవారం ఒక్కసారిగా పెరిగింది.

మళ్లీ మొదటికి...
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చిన అనుమానితులు

కొవిడ్‌ టెస్టులకు భారీగా అనుమానితులు

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుత్రిలో  సోమవారం ఒక్కరోజు 150 మంది పరీక్షలు

వైద్య వర్గాల్లో ఆందోళన

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 17: కొవిడ్‌ టెస్టులుచేయించుకోవడానికి వచ్చే అనుమానితుల సంఖ్య సోమవారం ఒక్కసారిగా పెరిగింది. ఆదివారంతో సంక్రాంతి పండుగ సందడి ముగియడంతో లక్షణాలున్న అనుమానితులంతా టెస్టులకు క్యూ కడుతున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో పరీక్షలకు వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ టెస్టుల కేంద్రానికి అనుమానిత లక్షణాలున్నవారు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలతో స్వాబ్‌ కలెక్ట్‌ చేసి కాకినాడలోని ల్యాబ్‌కుపంపించారు. సుమారు 150 మంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. రిపోర్టులు రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. ఎంత మందికి పాజిటివ్‌ అనేది తేలుతుంది. సెకండ్‌ వేవ్‌ ముగిసిన తర్వాత ఇంత భారీ స్థాయిలో అనుమానిత లక్షణాలున్నవారికి కొవిడ్‌ పరీక్షలు జరగడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. కాగా అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య గత కొద్ది రోజులుగా నామమాత్రంగానే ఉంటోంది. రోజుకు 15నుంచి 20మంది వచ్చేవారు. వీరికి టెస్టులు చేస్తే నలుగురు, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చేది. ప్రస్తుతం అనుమానిత లక్షణాలున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ వార్డుల్లో 25 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు. సంక్రాంతి పండుగగ తర్వాత కొవిడ్‌ అనుమానితుల సంఖ్యతో పాటు కేసులు భారీగా పెరుగుతాయని ఇప్పటికే వైద్య వర్గాలు    అంచనాతో ఉన్నాయి. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌కిశోర్‌ 

సంక్రాంతి పండుగ తర్వాత కొవిడ్‌ కేసులు పెరుగుతాయని ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న అనుమానితుల సంఖ్యను చూస్తే  అది నిజమనిపిస్తోంది. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించలేకపోయినా దాని నుంచి కాపాడుకునే రక్షణ చర్యలు అందరూ తీసుకోవాలి. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ను ఎదుర్కొనడానికి జిల్లా వైద్య యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంది. బొమ్మూరులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాము. త్వరలో దీనిని ప్రారంభిస్తాము.



Updated Date - 2022-01-18T07:27:33+05:30 IST