మళ్లీ మండిన జీడిమెట్ల.. జనాలు ఉక్కిరిబిక్కిరి.. గోప్యత

ABN , First Publish Date - 2021-04-18T18:13:58+05:30 IST

డిమెట్ల పారిశ్రామిక వాడలో దూలపల్లి రోడ్డులోని ఓ కెమికల్‌ గోదాంలో

మళ్లీ మండిన జీడిమెట్ల.. జనాలు ఉక్కిరిబిక్కిరి.. గోప్యత

  • గాయపడిన కార్మికుల వివరాలపై గోప్యత
  • కెమికల్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
  • యజమాని కుమారుడికి కూడా గాయాలు
  • ఆరు ఫైరింజన్లు.. ఏడుగంటల శ్రమ

హైదరాబాద్/జీడిమెట్ల : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దూలపల్లి రోడ్డులోని ఓ కెమికల్‌ గోదాంలో శనివారం మఽధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కెమికల్‌ గోదాం యజమాని కుమారుడు స్వల్పంగా గాయపడ్డాడు. భారీ ఎత్తునమంటలు, పొగలు ఎగిసి పడటంతో కుత్బుల్లాపూర్‌ ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏడు గంటలపాటు నరకం చూశారు. విషవాయువుల ఘాటుతో ఊపిరాడక అల్లాడి పోయారు. ఆరు అగ్నిమాపక దళాలు దాదాపు 7గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. దూలపల్లి రోడ్డులోని వెస్ర్టో సాల్వెంట్స్‌ కంపెనీ సమీపంలో మంగళంపాండ్యా శ్రీలక్ష్మి కెమికల్స్‌ పేరుతో కొన్నేళ్లుగా అక్రమంగా సాల్వెంట్స్‌ వ్యాపారం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గోదాంలో కెమికల్స్‌ను ఒక డ్రమ్ములో నుంచి మరో డ్రమ్ములోకి మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 


గోదాంలో నిల్వచేసిన సాల్వెంట్స్‌ డ్రమ్ములకు మంటలు వ్యాపించడంతో భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటనలో కొందరు కార్మికులు  గాయపడినా యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి పొగలు విరజిమ్మటంతో చుట్టుపక్కల కంపెనీల యాజమాన్యాలు, కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం సంఘటన గురించి తెలుసుకున్న జీడిమెట్ల, జిల్లాఫైర్‌ అధికారులు సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌ ప్రాంతాలనుంచి ఫైర్‌ ఇంజన్‌లను రప్పించి ఫోమ్‌ సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అక్రమంగా కెమికల్‌ గోదాంలను నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న గోదాంల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్ధానికులు డిమాండ్‌ చేశారు. పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కెమికల్‌ గోదాం యాజమానిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


స్టేషన్‌ రోడ్‌లో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లి రైల్వేస్టేషన్‌ ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆబిడ్స్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్‌లో ఉన్న మెట్రో ట్రేడింగ్‌ భవనంలోని 4వ అంతస్తులో శనివారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆబిడ్స్‌ పోలీసులు ఫైర్‌ ఇంజన్ల సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2021-04-18T18:13:58+05:30 IST