Hyderabad లో ఈ సారీ ముంపు తప్పదా?

ABN , First Publish Date - 2021-07-13T18:38:46+05:30 IST

చిన్నపాటి వర్షం పడినా ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరదతో..

Hyderabad లో ఈ సారీ ముంపు తప్పదా?

  • చిన్నపాటి వర్షానికే చేరుతున్న వర్షపు నీరు
  • అవుట్‌లెట్‌ నిర్మాణానికి పడని అడుగులు
  • కట్టచుట్టూ మట్టి నిర్మాణం.. కల్వర్టులే దిక్కు
  • భయాందోళనలో సరూర్‌నగర్‌ చెరువు పరీవాహక ప్రజలు

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : చిన్నపాటి వర్షం పడినా ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరదతో సరూర్‌నగర్‌ చెరువు పరీవాహకప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వర్షం వస్తుందంటే ముంపుతో జలదిగ్భందంలో చిక్కుకుపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. చెరువు సుందరీకరణ పనుల్లో అధికారులు చేపడుతున్న అనాలోచిత చర్యలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ముందుగా  ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు పోయేందుకు అవుట్‌లెట్‌ కాలువ నిర్మాణం చేపట్టకుండా చెరువు చుట్టూ మట్టి కట్టలు నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. యుద్ధప్రాతిపదికన  కల్వర్టులు నిర్మాణం చేసినా వరద నీరు ఉధృతికి అవి తట్టుకోకపోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


గత సంవత్సరం వచ్చిన వరదల్లో  20రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఇతర సహాయక బృందాలు వచ్చి బాధితులకు ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేశాయి. గత ఏడాది వరద ముంపును తలుచుకుని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారుల ముందుచూపు లేమితో అవుట్‌లెట్‌ కాలువ నిర్మాణం చేయకుండా చెరువు చుట్టూ మట్టి కట్ట ఏర్పాటు చేయడంతో  భారీ వర్షం వస్తే సరూర్‌నగర్‌ చెరువు సమీప కాలనీలు సింగరేణి కాలనీ, సరస్వతీ కాలనీ, తపోవన్‌ కాలనీ, గ్రీన్‌పార్క్‌ కాలనీ, రెడ్డి కాలనీ, కృష్ణానగర్‌, ఆదర్శనగర్‌ మునిగే  ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెరువు పరిసర కాలనీల్లో చెరువు లెవల్‌ కంటే తక్కువ ఎత్తులో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ప్రమాదంగా మారే అవకాశం ఉంది.


మిషన్‌ కాకతీయ కింద 2018లో సరూర్‌నగర్‌ చెరువు అభివృద్ధి, సుందరీకరణ కోసం ప్రభుత్వం  రూ.15కోట్ల నిధులు మంజూరు చేసింది. సుందరీకరణలో భాగంగా ముందుగా ఎగువ నీరు వచ్చే వరద నీరు చెరువులోకి రాకుండా చుట్టూ మట్టి కట్టలు కడుతున్నారు. కానీ కట్టలు నిర్మించే ముందు  పరిసర కాలనీల నుంచి వచ్చే వరద చెరువులోకి వెళ్లే ఏర్పాట్లు చేయాలి. కానీ వరద నీరు పోయేందుకు చర్యలు చేపట్టకుండా  హడావిడిగా చెరువు చుట్టూ మట్టి కట్టలు కట్టడం, ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టడం వివాదాస్పదమవుతోంది.  భారీ వర్షాలు పడితే వరద నీరు వెళ్లేందుకు దారిలేక చెరువు ఉప్పొంగే ప్రమాదం ఏర్పడుతుందని  ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


అటకెక్కిన నాలా విస్తరణ!

ఓ పక్క చెరువు చుట్టూ వరద నీరు రాకుండా మట్టికట్టలు, మరో పక్క ఆక్రమణలతో కుంచించుకుపోయిన నాలాలతో సరూర్‌నగర్‌ చెరువు పరిసర  కాలనీల్లో వరద ముంపు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నవంబర్‌ 2020లో ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ బాలాజీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ చెరువు వరకు వరద నీటి నాలా నిర్మాణానికి  5.99 కోట్లు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారై ఏడు నెలలవుతున్నా కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.   నాలా విస్తరణ పనులు చేపట్టకపోవడంతో బాలాజీనగర్‌, శ్రీ బాలాజీనగర్‌, కృష్ణనగర్‌, సింగరేణి ఆఫీసర్స్‌ కాలనీ, ఆదర్శనగర్‌ పరిసర కాలనీలు చిన్నపాటి వర్షం వచ్చినా జలదిగ్భందంలో చిక్కుకుపోతున్నాయి. వరద కాలువ వెడల్పుతో  ముంపు తప్పుతుందని భావించిన కాలనీవాసులకు పనులు మొదలు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కల్వర్టులు ఏర్పాటు చేశాం

సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ కడుతున్న మట్టికట్ట నిర్మాణాలవల్ల ముంపు సమస్య ఏర్పడే  ఆవకాశం లేకుండా కల్వర్టులు ఏర్పాటు చేశాం. ఎగువప్రాంతాల నుంచి వచ్చే వరద చెరువులోకి కాకుండా నేరుగా అలుగు వైపు వెళ్లే లా చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక కారణాలవల్ల అవుట్‌లెట్‌ కాలువ నిర్మాణ పనులలో జాప్యం జరుగుతోంది. త్వరలో 8 కోట్ల నిధులతో అవుట్‌లెట్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. - పవన్‌కుమార్‌, డీఈ, సరూర్‌నగర్‌ లేక్‌ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్ట్‌

Updated Date - 2021-07-13T18:38:46+05:30 IST