‘ఎయిడెడ్‌’ మెడపై Jagan Sarkar మరో కత్తి..!

ABN , First Publish Date - 2021-12-03T19:07:02+05:30 IST

‘ఎయిడెడ్‌’ మెడపై Jagan Sarkar మరో కత్తి..!

‘ఎయిడెడ్‌’ మెడపై Jagan Sarkar మరో కత్తి..!

  • 20మంది లోపు పిల్లలుంటే స్కూలు మూతే..
  • జిల్లాలో 60 ఎయిడెడ్‌ పాఠశాలలపై వేటు
  • అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇతర స్కూళ్లకు..

గుంటూరు : జిల్లాలో మరో 60 ఎయిడెడ్‌ పాఠశాలలు శాశ్వతంగా మూత పడనున్నాయి. మీ పాఠశాలల్లో 20మందిలోపు విద్యార్థులే ఉన్నారు.. విద్యార్థుల్ని పెంచుకోవడంలో ఎందుకు శ్రద్ధచూపడం లేదు.. మీ పాఠశాలకు ఎందుకు మూత వేయకూడదో చెప్పాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో అత్యధికంగా ఆర్‌సీఎం పాఠశాలలే ఉన్నాయి. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. తొలుత జిల్లాలో దాదాపు 270పైగా పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి విలీనానికి అంగీకరించాయి. ఆ తర్వాత ఈ విలీనంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గింది. యాజమాన్యాలకు ఆప్షన్లు ఇచ్చి విలీన ప్రక్రియకు తాత్కాలికంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నోటీసులు..

జిల్లాలో గత మూడేళ్ల నుంచి విద్యార్థుల సంఖ్య పెంచలేని ఎయిడెడ్‌ పాఠశాలలకు నోటీసులు జారీచేసినట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని వెల్లడించారు. అక్కడ ప్రభుత్వం గ్రాంటు మంజూ రుతోపాటు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తుందని తెలిపారు. యాజమాన్యాల వివరణ ప్రభుత్వానికి నివేదిస్తామని అక్కడినుంచి వచ్చే ఆదేశాలు అమలు చేస్తామని ఆమె తెలిపారు.


జిల్లాలో అనేక ఎయిడెడ్‌ పాఠశాలలో గత మూ డేళ్ల నుంచి విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల్ని ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ విద్యార్థులు లేనప్పుడు ఉపాధ్యాయులు, పాఠశాల అవసరం ఏంటని విద్యాశాఖ ప్రశ్నిస్తోంది. విద్యార్థుల్ని ఎందుకు పెంచడలేదని.. దానికి సహేతుక కారణం లేకుంటే సదరు పాఠశాలను శాశ్వతంగా మూసివేసేలా పాఠశాల విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఆలోచిస్తున్నారు. దీంతో తాజాగా ఇప్పుడు ఇటువంటి పాఠశాలలకు నోటీసులు జారీ అయ్యాయి. యాజమాన్యాలు విద్యార్థుల పెంపు విషయంలో సహేతుకమైన సమాధానాలు ఇవ్వకుంటే జీవో నం.1 ప్రకారం సదరు ఎయిడెడ్‌ పాఠశాలలకు గ్రాంటు నిలిపివేసిఅక్కడ పనిచేసే ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. అంటే  ఆ పాఠశాల ఇక శాశ్వతంగా మూతపడినట్లేనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడిస్తున్నారు.

Updated Date - 2021-12-03T19:07:02+05:30 IST