మళ్లీ ‘నేతన్నకు చేయూత’: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-06-15T07:46:47+05:30 IST

రాష్ట్రంలోని నేత కార్మికులకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం ‘నేతన్నకు చేయూత’ను పునఃప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మళ్లీ ‘నేతన్నకు చేయూత’: కేటీఆర్‌

చేనేత, మరమగ్గాల కార్మికులు చేరాలి

హైదరాబాద్‌/సిరిసిల్ల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నేత కార్మికులకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం ‘నేతన్నకు చేయూత’ను పునఃప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులు పొదుపు పథకంలో చేరాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో టెక్స్‌టైల్‌ శాఖ అధికారులు, సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులతో కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘నేతన్నకు చేయూత’ పథకంలో చేరిన కార్మికులు పొదుపు చేసుకున్న దానికి అదనంగా ప్రభుత్వం తన వాటా ను జమ చేస్తుందన్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉత్పత్తి అవుతోన్న కోటి బతుకమ్మ చీరలపై కూడా కేటీఆర్‌ చర్చించారు. కొన్ని చీరలను పరిశీలించారు. ఈ సారి బతుకమ్మ చీరల తయారీలో డాబీ, జాకార్డ్‌ డిజైన్లను తీసుకురావడంతో ఉత్పత్తి తగ్గి కార్మికులకు జీతాలు తగ్గిపోయాయని సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. 

Updated Date - 2021-06-15T07:46:47+05:30 IST