ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల పోటాపోటీ.. ఏం జరుగునో..!?

ABN , First Publish Date - 2021-06-14T19:34:30+05:30 IST

అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనాయకుడి పదవి, విప్‌ పదవి కోసం పార్టీ ఉపసమన్వయకర్త

ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల పోటాపోటీ.. ఏం జరుగునో..!?

  • అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడు ఎవరు?
  • నేడు ఎమ్యెల్యేల సమావేశం

చెన్నై : అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనాయకుడి పదవి, విప్‌ పదవి కోసం పార్టీ ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు, సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం వర్గీయులు పోటీపడుతున్నారు. గత మే నెల ప్రారంభం నుంచి ఈ రెండు పదవుల కోసం ఇరువర్గాలకు చెందిన నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ సీనియర్‌ నాయకులు రంగంలోకి దిగారు. గత శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే 65 నియోజకవర్గాలలో గెలిచి బలమైన ప్రధానప్రతిపక్షంగా అవతరించింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం పోటీపడ్డారు. దీనితో గత మే నెల 7న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరిపి ఆ ఇరువురిలో ఒకరిని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. కానీ ఆ రోజు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో సభాపక్ష నేత ఎంపికపై నాయకుల నడుమ ఏకాభిప్రాయం కుదరలేదు. అదే సమయంలోని పార్టీ కార్యాలయం వెలుపల ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వర్గాలకు చెందిన కార్యకర్తలు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి పాల్పడ్డారు. చివరకు సభా పక్షనేత ఎంపిక జరుగకుండానే సమావేశం ముగిసింది. 


పట్టుసడలించిన ఓపీఎస్‌..

ఆ తర్వాత ఈనెల 10న జరిగిన అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశంలో పన్నీర్‌సెల్వం మెతక వైఖరిని ప్రదర్శించారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని, పదవులే తనను వెతక్కుంటూ వచ్చి వరించాయని పేర్కొన్నారు. తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవికి పోటీ చేయడం లేదని, ఆ పదవికి మాజీ స్పీకర్‌ ధనపాల్‌ పేరును ప్రతిపాదిస్తున్నానని పన్నీర్‌సెల్వం ప్రకటించారు. కానీ ఆ ప్రతిపాదనను శాసనసభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. కొంగు మండలానికి చెందిన శాసనసభ్యులైన మాజీ మంత్రులు సెంగోట్టయ్యన్‌, ఎస్పీ వేలుమణి, తంగ మణి ఆ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరితోపాటు దిండుగల్‌ శ్రీనివాసన్‌, కామరాజ్‌, దళవాయి సుందరం, రాజన్‌ చెల్లప్పా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రతిపక్షనేతగా ఎంపికైనట్టు ప్రకటిం చారు. అదే సమయంలో సభాపక్ష ఉపనాయకుడి పదవిని స్వీకరించాలంటూ పార్టీ సీనియర్‌ నాయకులు చేసిన ప్రతిపాదనను పన్నీర్‌సెల్వం సున్నితంగా తిరస్క రించారు. ఎడప్పాడి ప్రతిపక్షనేతగా ఎంపికైనట్టు స్పీకర్‌ అప్పావుకు తెలియపరిచే లేఖలో పన్నీర్‌సెల్వం సంతకం పెట్టి వెళ్ళిపోయారు. 


ఈ పరిస్థితుల్లో ఈనెల 21న కలైవానర్‌ అరంగంలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ లోపున అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడిని, విప్‌ను ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో ఈనెల 14న రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాల యంలో అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం జరుగుతుందని ప్రకటన జారీ చేశారు. ఈ సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభ్యులు మాత్రమే పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. గుర్తింపు కార్డులున్న ఎమ్మెల్యేలకు తప్ప ఇతరులెవ్వరినీ లోనికి అనుమతించేది లేదని ఇప్పటికే అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే శశికళ పార్టీ కార్యకర్తలతో సంభాషించే ఆడియోలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడి తీవ్ర సంచలనం కలిగించింది. ఈ పరిస్థితుల్లో సోమవారం జరుగనున్న అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనాయకుడిగా పార్టీ సీనియర్‌ నేతలు దిండుగల్‌ శ్రీనివాసన్‌, వైద్యలింగం, సి. విజయభాస్కర్‌, నత్తం విశ్వనాఽథన్‌లలో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక పార్టీ విప్‌ పదవికి పార్టీ సీనియర్‌ నేతలు వేలుమణి, పొల్లాచ్చి జయరామన్‌, మనోజ్‌ పాండ్యన్‌ పోటీపడుతున్నారు. 

Updated Date - 2021-06-14T19:34:30+05:30 IST