Abn logo
Jun 11 2021 @ 14:31PM

ముంబైలో జరిగిన బీభత్సంతో వణుకుతున్న హైదరాబాదీలు!

  • నేటికీ పూర్తికాని గతేడాది చేపట్టిన పనులు
  • ప్రతిపాదనలకే ప్రణాళికలు
  • గతేడాది ముంపు నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల హడావిడి
  • అనంతరం పట్టించుకోని వైనం
  • చెరువు కట్టల పునరుద్ధరణ ఏది..? 
  • గత అనుభవాల నుంచి గుణపాఠం 
  • నేర్చుకోని యంత్రాంగం

ముంబయిలో బుధవారం కురిసిన తొలి వానలకే ఆ నగరం వరద బీభత్సాన్ని చవిచూసింది. ఆ దృశ్యాలను చూసిన హైదరాబాద్‌ నగర పౌరులకు గడిచిన ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ పడ్డ వానలు జ్ఞాపకం వచ్చాయి. ఆ వానలు సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కదలాడింది. మళ్లీ వానాకాలం రానే వచ్చింది. ఈసారి అయినా ఆ బాధాకర అనుభవాలు పునరావృతం కాకుండా ఉంటాయా? అధికారులు ఆ మేరకు రక్షణ చర్యలు చేపట్టారా? ఈ ప్రశ్నలకు ‘నో’ అనే సమాధానమే వస్తోంది. నాడు ముంపు ముప్పును అనుభవించిన ప్రాంతాలలో నేటికీ ఆపద పొంచి ఉంది. ఆ పరిస్థితిపై ప్రత్యేక కథనాలు నేటి నుంచి..


హైదరాబాద్‌ సిటీ : గతేడాది అక్టోబర్‌లో మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లె చెరువు నిండి కట్టకు గండిపడింది. దీంతో వరద ముంచెత్తి అలీనగర్‌లో నివాసముండే ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అబ్దుల్‌ ఖుద్దుస్‌ ఖురేషీ (66) సమీపంలోని చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకోగా, మిగతా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 


- కుత్బుల్లాపూర్‌లోని ఉమామహేశ్వర కాలనీలో రికార్డు స్థాయి వర్షాలకు వరదనీరు పోటెత్తింది. సుమారు 644 ఇళ్లు నీట మునిగాయి. నీరు పోవడానికి సుమారు 4 నెలలు పట్టింది. కాలనీలో నివసించే 70 శాతం కుటుంబాలు మాత్రమే కాలనీకి తిరిగి రాగా, మరో 30 శాతం కుటుంబాలు ఇప్పటికీ రాలేదు. 

- ఆయా ప్రాంతాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు తక్షణ మరమ్మతుతోపాటు దీర్ఘకాలిక పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. తెగిన కట్టలకు మరమ్మతు/పునరుద్ధరణ చేసిన యంత్రాంగం.. భారీ వర్షాలు పడితే దిగువకు నీరు వెళ్లేలా నాలాల విస్తరణ, అవుట్‌లెట్‌ల పునర్ని ర్మాణానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. వరదలు ముంచెత్తినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామనే అధికారులు అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.  కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా, ఇంకొన్ని ప్రాంతాల్లో మొదలు కాలేదు. దీంతో మరోమారు కొన్ని ప్రాంతాల్లో ముంపు ముప్పు తప్పేలా లేదు.

ఇవి కూడా చదవండిImage Caption

శవాల దిబ్బగా ఇల్లు

అప్పా చెరువు ఆగమాగం... 

గగన్‌పహడ్‌ అప్పా చెరువు కట్టతెగి నలుగురు మరణించడంతో అప్పట్లో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు సందర్శించి చెరువు కట్టను పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు.  రూ.1.5 కోట్ల ఖర్చుతో చెరువు చుట్టూ కట్ట నిర్మించారు. గండిని పూడ్చి రూ. 2.2 కోట్లతో కట్ట పునరుద్ధరించారు. కానీ వరద నీరు దిగువకు సాఫీగా వెళ్లేలా నాలా విస్తరణ ఇప్పటికీ చేయలేదు. అలీనగర్‌ నుంచి మూసీ వరకు నాలా విస్తరణ పనులు పూర్తవ్వాలంటే మరో రూ. 15 కోట్లు అవసరం అవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. 


మీర్‌పేట్‌లో సా..గుతున్న పనులు

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పెద్దచెరువు, మంత్రాలచెరువు, సందచెరువుల ఎగువ, దిగువ కాలనీలన్నీ గతేడాది ముం పునకు గురయ్యాయి. అల్మా్‌సగూడలోని కోమటికుంట, పోచమ్మకుంటల నుంచి మీర్‌పేట్‌ పెద్దచెరువుకు, అక్కడి నుంచి మంత్రాలచెరువు మీదుగా సందచెరువకు వరద భారీగా వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యకు పరిష్కారంగా రూ.23 కోట్లతో భారీ ట్రంక్‌లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి కే తారక రామారావు మూడేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు సా..గుతూనే ఉన్నాయి. కిందటి సంవత్సరం వరదతో ఇబ్బందులు పడ్డా, ట్రంక్‌ లైన్‌ నిర్మాణం పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించలేదు. వర్షాకాలం మొదలవడం, ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


చిన్న వర్షానికే...

నాగోలు డివిజన్‌ అయ్యప్ప కాలనీని గతేడాది వరద ముంచెత్తింది. అయ్యప్ప కాలనీ, మల్లికార్జుననగర్‌ మీదుగా బండ్లగూడ చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ నీరు సాఫీగా చెరువులోకి వెళ్లేందుకు బాక్స్‌ డ్రైన్‌ నిర్మాణం చేపట్టారు. ఆ పనులు ఇంకా సాగుతున్నాయి. దీంతో వారం రోజుల కిందట కురిసిన చిన్న వర్షానికే నాలుగు ఇళ్లలోకి నీరు వచ్చింది. చింతలకుంట ఆగమయ్యనగర్‌ కాలనీ కూడా గతేడాది నీట మునిగింది. ఇక్కడ రూ.10 కోట్ల వ్యయంతో బాక్స్‌టైప్‌ డ్రైన్‌ నిర్మాణం చేపడుతున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయి. ఆ డ్రైన్‌ నిర్మాణం  పూర్తయితే కానీ ముంపు సమస్య తీరే అవకాశం లేదు. 


కొత్తపేటలో పరిష్కారం..

కొత్తపేట డివిజన్‌ పరిధిలోని అల్కాపురి చౌరస్తా నుంచి స్నేహపురి కాలనీ, న్యూనాగోల్‌, నాగోల్‌ చౌరస్తా, సమతాపురిల మీదుగా మూసీ వరకు రూ 12 కోట్ల వ్యయంతో బాక్స్‌టైప్‌ ట్రంక్‌లైన్‌ నిర్మాణంతో వరద ముంపు సమస్య పరిష్కారమైంది. అదే విధంగా ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ, మారుతీనగర్‌, సత్యానగర్‌ పరిసర కాలనీల్లో వదర నీటి ముంపు సమస్యను పరిష్కరించడానికి రూ కోటిన్నర వ్యయంతో మారుతీనగర్‌ నుండి ట్రంక్‌లైన్‌ నిర్మించారు. 


నిధులు మంజూరైనా... 

మహేశ్వరం నియోజకవర్గం ఉదయ్‌నగర్‌కాలనీలో వరద నీరు త్వరగా దిగువకు వెళ్లేందుకు గతేడాది నాలా ధ్వంసం చేశారు. నాలా పునర్నిర్మాణానికి రూ. 68 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. సంతో్‌షనగర్‌ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు చంపాపేట డివిజన్‌లోని యాదగిరినగర్‌కాలనీ, దుర్గానగర్‌కాలనీ, ఎస్‌జీఆర్‌కాలనీ, రెడ్డికాలనీలు గతేడాది నీట మునిగాయి. దీంతో ప్రస్తుత వర్షాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement