మళ్లీ వారికేనా!?

ABN , First Publish Date - 2022-01-28T05:34:15+05:30 IST

‘పదవుల్లో ఉన్నవారికే పదవులా..? అధికార హోదాను అనుభవిస్తున్న వారికే మరో పదవా..? తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేసినా మా సంగతి అంతేనా..?’ అన్న నిరసన స్వరం ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో వి నిపిస్తోంది.

మళ్లీ వారికేనా!?

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల ఎంపికపై సీనియర్‌ నేతల అసంతృప్తి
అధికారిక పదవులు అనుభవిస్తున్న వారికే పట్టం కట్టడంపై నిరసన ధ్వనులు
మితిమీరుతున్న ఎమ్మెల్యేల పెత్తనంపై అసహనం
ప్రత్యామ్నాయ మార్గాల వెతుక్కోవడంపై నేతల యోచన


ఓరుగల్లు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
‘పదవుల్లో ఉన్నవారికే పదవులా..? అధికార హోదాను అనుభవిస్తున్న వారికే మరో పదవా..? తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేసినా మా సంగతి అంతేనా..?’ అన్న నిరసన స్వరం ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో వి నిపిస్తోంది. పార్టీ పటిష్టంగా ఉండాలంటే ప్రభుత్వ  హో దాలేని వారైతేనే సాధ్యం అవుతుందని జిల్లాలోని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ బా ధ్యతలు అప్పగించడంకోసం సీనియర్‌ నేతల పేర్లను కొం తకాలం కిందటే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పరిశీలించింది. ఒ క్కసారిగా వారి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో అవాక్కయ్యారు.  

ఆశలు అడియాసలు

అధినేత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల స్థాయి దాటి దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఇలాంటి సందర్భంలో పార్టీ పటిష్టంగా ఉండడం ఎంతో అవసరమని  కేసీఆర్‌ భావించినట్లు అవగతమవుతోంది. చాలాకాలం కిందటే గ్రామస్థాయి, మండలస్థాయి పార్టీ కమిటీలు, కొన్ని అనుబంధ కమిటీల నియామకం జరిగింది. నియోజకవర్గ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల నియామకం కోసం జిల్లాల నుంచి కొందరి పేర్లను కూడా పరిశీలించారు. త్వరలో  అవకాశం వస్తుందని ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం వెలువడింది.

హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, జనగామ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్‌ కవిత, ములుగు జిల్లా అధ్యక్షుడిగా జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అఽధ్యక్షురాలిగా వరంగల్‌ (వరంగల్‌ రూరల్‌) జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతిలను నియమించారు. సామాజిక సమీకరణల్లో భాగంగా ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒకరు దళిత, మరొకరు గిరిజన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కింది.

అన్ని పదవులు వారికేనా...?
ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లకే పార్టీ పదవులు దక్కడం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార పదవులు అనుభవిస్తున్న నేతలు తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప తమను పార్టీ నేతలుగా గుర్తించడం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మహ్మద్‌ అంకూస్‌ కాంగ్రె్‌సపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనలాంటి వారికి పార్టీలో  ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలో కూడా తలెత్తే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

జనగామ జిల్లా సీనియర్‌ నాయకులు చేవెళ్ళ సంపత్‌, బండ యాదగిరి రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, పసుల ఏబెల్‌లాంటి నేతలు అధ్యక్ష బాధ్యతలు ఆశించిన వారిలో ఉన్నారు. ఇలా వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ జిల్లాల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. అందరిలో ఒకే అంశంపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు బలో పేతం కాకపోవడంవల్ల తాము మరోదారి చూసుకోలేక పోతున్నామని అసంతృప్త నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడు ఉన్నట్టే ఎప్పటికీ ఉంటాయా..? ఏ మాత్రం ఆశాజనకంగా ఉన్నా తమ దారి తాము చూసుకునేందుకు వెనుకాడేది లేదంటున్నారు.

ఎమ్మెల్యేల ఏకచ్ఛత్రాధిపత్యం
గత రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పాలనలో ఏకచ్ఛత్రాధిపత్యంగా కొనసాగుతున్నారు. తమ నియోజకవర్గాల్లో తామే రాజు.. తామే మంత్రి.. అన్న పద్దతి కొనసాగుతోంది. మంత్రులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, మేయర్‌, మునిసిపల్‌ చైర్మన్‌లు ఎవరైనా సరే, ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఆయా నియోజకవర్గాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని ముఖ్య శాఖలకు సంబంధించిన అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు కూడా ఎమ్మెల్యేల అనుమతితోనే జరుగుతున్నాయంటున్నారు. ఇంతటి అధికారహోదా అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్‌ నాయకులకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు, ఇతర అధికార పదవులు అనుభవిస్తున్న వారికే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడంవల్ల పార్టీలో తీవ్ర వైరుధ్యాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదని సీనియర్‌ నేతలు అంటున్నారు.

Updated Date - 2022-01-28T05:34:15+05:30 IST