Hyderabad లో మరో మూడ్రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2021-07-19T18:38:31+05:30 IST

నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని...

Hyderabad లో మరో మూడ్రోజులు వర్షాలు

  • గ్రేటర్‌లో తగ్గని వర్షం జోరు
  • లోతట్టుప్రాంతాలు అప్రమత్తం 
  • నిండుకుండల్లా మారుతున్న చెరువులు, కుంటలు
  • మరో మూడురోజులు వర్షాలు

హైదరాబాద్‌ సిటీ : ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో లోతట్టు కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లెలగూడలోని చందన్‌చెరువు నిండిపోవడంతో కిందిభాగంలో ఉన్న మితులానగర్‌ వాసులు వణికిపోతున్నారు. మీర్‌పేట మంత్రాలయ చెరువు నిండుకుండలా మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఫాక్స్‌ సాగర్‌, నిజాంపేట తర్కు చెరువు, మల్లంపేట కత్వచెరువు, బాచుపల్లిలోని బైన్‌ చెరువులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి.


ట్రాఫిక్‌ జాం..

ఆదివారం కురిసిన వర్షంతో అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌, మియాపూర్‌,  మెహిదీపట్నం, పంజాగుట్ట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, గన్‌ఫౌండ్రీ, బేగంపేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.


మరో మూడు రోజులు 

నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారి నాగరత్నం తెలిపారు. జూలై 21న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.


అల్లంతోట బాయిలో నీట మునిగిన ఇళ్లు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బేగంపేట మయూరి మార్గ్‌లోని అల్లంతోట బాయి, బ్రాహ్మణవాడి నీట మునిగాయి. ఇవి కూకట్‌పల్లి నాలా పక్కన ఉండడంతో చిన్న పాటి వర్షం కురిసినా ఇక్కడి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది. దీంతో వారం రోజులుగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పిట్లకేఫ్‌ నుంచి ఎడమవైపున ఉన్న ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. దేవనార్‌ అంధుల పాఠశాలతో పాటు సమీపంలోని ఆర్‌కే టవర్స్‌ వెనుక ఉన్న హనుమాన్‌ దేవాలయం ప్రాంతంలోని నాలుగు లేన్స్‌లో వరద నీరు చేరింది. స్థానిక కార్పొరేటర్‌ ఇంటి సమీపంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరినా ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలు తీసుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రోడ్లపై నీరు..

ఖైరతాబాద్‌లో కరిసిన వర్షానికి ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌, ఖైరతాబాద్‌ గణపతి ప్రాంగణం, రైల్వేగేటు చౌరస్తా, లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌, సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయ ప్రాంతం, లక్డీకాపూల్‌ వెంకటేశ్వర హోటల్‌ చౌరస్తా, సైఫాబాద్‌ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది.



Updated Date - 2021-07-19T18:38:31+05:30 IST