Jun 10 2021 @ 21:14PM

మరోసారి విజయ్‌ చిత్రంలో యోగిబాబుకి ఛాన్స్

కోలీవుడ్‌లో ఉన్న హాస్యనటుల్లో సంతానం, సూరితోపాటు మరికొందరు ఇచ్చిన చిన్నపాటి విరామం కారణంగా.. సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన యోగిబాబు ఇప్పుడు స్టార్‌ కమెడియన్‌గా మారిపోయారు. చిత్రసీమలోని రజనీకాంత్‌, అజిత్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో హాస్య సన్నివేశాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో హీరో విజయ్‌ ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యోగిబాబు ఓ పాత్రను పోషిస్తున్నట్టు ధృవీకరించారు. కాగా, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కోలమావు కోకిల’ అనే చిత్రంలో యోగిబాబు హీరోగా నటించడం గమనార్హం. ఆ తర్వాత ‘మెర్సల్‌’, ‘సర్కార్‌’, ‘బిగిల్‌’ వంటి చిత్రాల్లో హీరో విజయ్‌ చిత్రాల్లో యోగిబాబు నటించారు.