‘సర్కస్ కార్‌ 2’తో.. బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి కలకలం

ఇటీవల వర్మతో ఇంటర్వ్యూ ఇచ్చి ఆషు రెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సర్కస్ కార్‌ 2’ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపేందుకు ఆషు రెడీ అవుతోంది. ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో శివరాజు వికె నిర్మిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘సర్కస్ కార్ 2’. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘సర్కస్ కార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఒక రోజు ఉదయం ఊరి పొలిమేరల్లో జనాలకు ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు ఎవరిదో ఎవరికీ తెలియదు. ఆ ఊరివారిని మాత్రం సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? అనే కథాంశంతో హారర్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుందీ చిత్రం.

ఈ సందర్భంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ... ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్.. ఈ సీక్వెల్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఆషు రెడ్డి అందాలు, దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు- వాటి పరిణామాలు వంటి వాటితో.. భయంతో కూడిన వినోదాన్ని పంచే చిత్రంగా ‘సర్కస్ కార్-2’ ఉండబోతోంది. మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్‌కి, అలాగే మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము.. అని తెలిపారు.

Advertisement