అగస్తేశ్వరకోనలో కార్తీక మాస పూజలు

ABN , First Publish Date - 2020-11-29T05:03:29+05:30 IST

కార్తీక మాస పూజలతో ప్రసిద్ధ శైవక్షేత్రమైన అగస్తేశ్వరకోన భక్తుల సందడితో కిటకిటలాడుతోంది.

అగస్తేశ్వరకోనలో కార్తీక మాస పూజలు
ఆలయంలోని గణపతి, శివపార్వతులు

రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు  భక్తులు భారీ సంఖ్యలో రానున్నందున ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు 

 కరోనా నిబంధనలు తప్పక పాటించాలంటూ అధికారుల ఆదేశాలు అమలులో ఆలయ కమిటీ సభ్యులు

మైలవరం, నవంబరు 28 :కార్తీక మాస పూజలతో ప్రసిద్ధ శైవక్షేత్రమైన అగస్తేశ్వరకోన భక్తుల సందడితో కిటకిటలాడుతోంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రానున్నందున ఆలయ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం రాత్రికి పౌర్ణమి వస్తుండడంతో మధ్యాహ్నం నుంచే భక్తులు అగస్తేశ్వర కోనకు బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలలో భక్తులు చేరుకోనున్నారు.  సుందరమైన కొండ కోనలు, వాగు వంకలు,  ప్రకృతి సిద్ధమైన గుహాలయాలు  కమనీయ రమణీయ దృశ్యాలతో అగస్తేశ్వర క్షేత్రం అలరారుతోంది. కాగా సకల వ్యాధి నివారణ క్షేత్రంగా శ్రీ అగస్త్య మహాముని కఠోర దీక్ష తపో భూమి అయిన ఈ క్షేత్రం భక్తుల పెన్నిధిగా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో భక్తుల సందడితో ఈ క్షేత్రం కళకళ లాడుతూ ఉంటుంది. రాయలసీమలోని దండకారణ్యంలో ఎందరో మహానుబావుల, మహర్షుల పాద ధూళితో పుణీతమైన ఈ అగస్తేశ్వర క్షేత్రం శ్రీ అత్రిముని కోనగా కూడా విరాజిల్లుతూ ఉంది. 

క్షేత్ర మహిమ..

మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో కొండల నడుమ ఈ అగస్తేశ్వర క్షేత్రం ఉంది. త్రేతాయుగంలో అగస్త్య మహాముని దేశ సం చారం చేస్తూ వింధ్య పర్యతాల  నుంచి దక్షిణ దిశగా వెళ్తుతూ మార్గం మధ్యలో అనేక  చోట్ల శివలింగాల ప్రతిష్ఠలు చేసి తపస్సు కొనసాగిస్తూ ముందుకు సాగుతూ  దండకారణ్యమైన   అగస్తేశ్యర కోనలో అడుగు పెట్టినట్లు స్థల పురాణంలో ఉన్నట్లు స్థానికుల కథనం అలాగే ఇక్కడ మనో సిద్ధి కోసం ధర్మపత్ని లోపముద్రతో కూడి పరమేశ్వరానుగ్రహానికై శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వర విగ్రహాలను ప్రతిష్ఠగావించి ఘేర తపస్సు చేసినట్లు స్థానికుల కథనం ద్వారా తెలుస్తోంది. 

ఆకట్టుకుంటున్న దివ్య కొలను

అనేక రాజ్యాల రాజకీయ చతురతను, వీర విహారాన్ని గుర్తుకు తెస్తూ సాక్షీ భూతంగా నిలిచిన గండికోట దుర్గానికి అతీ సమీపంలో లోయ, ఆవతలి వైపు కొండలో వెలసిన శ్రీ అగస్తేశ్వర క్షేత్రంలో స్వయం సిద్ధంగా పుట్టిన పిల్ల కాలువలతో, వన మూలికలతో దివ్య ఔషధమైన జలాన్ని నింపుకున్న కొలను ఇక్కడ ఉంది. ఈ కొలనులో అగస్త్య మహాముని ప్రతి రోజు స్నానం ఆచరించి జప తపాలు చేసినట్లు స్థల పురాణం వల్ల తెలుస్తుంది.

ప్రత్యేక పూజలందుకుంటున్న ఆదిశేషుడు

శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వర వర ప్రసాదంగా, శ్రీ అగస్త్య లోపాముద్రల తపో ఫలితంగా వెలసిన ఆదిశేషుని నివాసం (బ్రహ్మాండమైన పుట్ట) మహిళల కలలను సాకారం చేస్తుండడం ఓ విశేషం. ఇక్కడ ఉన్న పుట్టకు 40 రోజుల పాటు ప్రదర్శనలు చేసి సంతానం లేనివారు. ఎంద రో మాతృత్వ పొందుతూ ఉన్నారు. ఇది ఇక్కడి ప్రజల నమ్మకం. 

కోనకు ప్రతి రోజూ ఆర్టీసీ బస్సు సౌకర్యం

కాగా కార్తీక మాసం పురస్కరించుకుని జమ్మలమడుగు నుంచి శ్రీ అగస్త్వేశ్వర కోనకు ఆర్టీసీ వారు ప్రతి రోజు బస్సు సౌకర్యం కల్పిం చారు. రోజు రోజుకు సందర్శకుల రద్దీ పెరుగుతుండడంతో భక్తాదుల నివాసానికి వసతి, భోజన సదుపాయాలతో ఈ క్షేత్రం నిత్య నూతనం గా విరాజిల్లుతూ ఉంది. కార్తీక మాసం, దత్త జయంతి, నవరాత్రి ఉత్సవాలు, అలాగే ధనుర్మాసంలో విశేష పూజలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ క్షేత్రం కార్తీక మాసంలో  భక్త జన సందోహంతో కోలాహలంగా తిరుణాల వాతావరణంలో ఉంటుంది. 



Updated Date - 2020-11-29T05:03:29+05:30 IST