Abn logo
Sep 19 2021 @ 01:23AM

కుడకుడ ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు

న్యూ డెమోక్రసీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు 

చివ్వెంల, సెప్టెంబరు 18: జిల్లాకేంద్రం సమీపంలోని కుడకుడ లో సర్వే నెం. 126.. ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎంఎల్‌), న్యూడె మోక్రసీ చంద్రన్న వర్గం నాయకు లు పలువురు స్థానికులతో కలిసి శనివారం ఎర్రజెండాలు నాటారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తాము నిరుపేదలమని, తమకు ఇళ్లులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పట్టించుకోవడం లేదన్నారు. తమకు నిలువ నీడలేకనే ప్రభుత్వ భూమిలో నివసించడానికి జెండాలు పాతామన్నారు. ప్రభుత్వ భూమిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేస్తున్నారని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి జెండాలను తీసి, అక్కడినుంచి వెళ్లగొట్టారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి నాయకులను అదుపులోకి తీసుకొని 15 మందిపై కేసులు నమోదుచేశారు. కార్యక్రమంలో పీవోబీ జాతీయ కన్వీనర్‌ సంధ్య, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అచ్యుత రామారావు, రేణుక, శారద పాల్గొన్నారు.