దూకుడే రాహుల్ మార్గం!
ABN , First Publish Date - 2021-07-25T06:49:03+05:30 IST
దేశవ్యాప్తంగా కాంగ్రె్‌స లో నెలకొన్న స్తబ్ధతకు స్వస్తి పలకాలని రాహుల్ నిర్ణయించుకున్నారా
ముగ్గురు పీసీసీ చీఫ్‌ల నియామకం చెప్పేదిదే
న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కాంగ్రె్‌స లో నెలకొన్న స్తబ్ధతకు స్వస్తి పలకాలని రాహుల్ నిర్ణయించుకున్నారా!? రాష్ట్రాల్లోనూ ఇక పార్టీ దూకుడు పెంచాలని భావిస్తున్నారా!? ఇందుకు ‘ఔను’ అనే అం టున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవలి పీసీసీ చీఫ్‌ల నియామకాలే ఇందుకు నిదర్శనమంటున్నాయి. కేంద్రంలో మోదీని ఎదుర్కోవడానికి, మోదీ సర్కారు తప్పిదాలను బహిర్గతం చేయడానికి, వీటిపై రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి బలమైన, దూకుడు ప్రద ర్శించే నేతలకు నాయకత్వం అప్పగించాలని, తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం కల్పించాలని రాహుల్ భావిస్తున్నారని వివరిస్తున్నారు. పార్టీ సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చినా.. తీవ్రస్థాయిలో అంతర్మథ నం చేసిన తర్వాత పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, తెలంగాణలో రేవంత్ రెడ్డి, మహారాష్ట్రలో నానా పటోలేను నియమించిన తీరును ఉదాహరిస్తున్నారు. పార్టీలో స్తబ్ధతను తనదైన శైలిలో బద్దలు కొట్టేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
త్వరలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లోనూ పీసీసీ అధ్యక్షులను మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నిజానికి, ఇటీవల నియమించిన ముగ్గురు పీసీసీ అధ్యక్షులు పార్టీలో తలలు పండిన నేతలు కారు. సిద్ధూ నాలుగేళ్ల కిందటే కాంగ్రె్‌సలో చేరారు. ఆయన అంతకుముందు పదేళ్లపాటు బీజేపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రారంభం నుంచీ టీడీపీలో కొనసాగిన తర్వాత.. నాలుగేళ్ల కిందట 2017లోనే కాంగ్రె్‌సలో చేరారు. విద్యార్థి దశలో ఆయన ఏబీవీపీ సభ్యుడు కావడం గమనా ర్హం. ఇక, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే పరిస్థితి మరీ విచిత్రం. ఆయన 1990లో కాంగ్రె్‌సలో చేరారు. ఆ తర్వాత రెండుసార్లు పార్టీ మారి మళ్లీ కాంగ్రె్‌సలోకి వచ్చారు. కొద్ది కాలం కిందట కూడా బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. ఈ మూడు నియామకాలు కూడా రాహుల్, ప్రియాంక కలిసి నిర్ణయించినవేనని, వారిద్దరూ ఓసారి నిర్ణయం తీసుకుంటే ప్రశ్నించడానికి వీల్లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.