మా పొట్ట కొట్టొద్దు

ABN , First Publish Date - 2021-05-14T04:46:09+05:30 IST

ధరలు పతనం చేయడంతోపాటు తమను అనేక రకాలుగా మోసం చేస్తూ వ్యాపారులు తమ పబ్బం గడుపుకుంటున్నారని పూల రైతులు ఆరోపించారు.

మా పొట్ట కొట్టొద్దు
కుప్పంలో రోడ్డుమీద ధర్నా చేస్తున్న పూల రైతులు

కుప్పంలో పూల రైతుల ఆందోళన


కుప్పం, మే 13: ధరలు పతనం చేయడంతోపాటు తమను అనేక రకాలుగా మోసం చేస్తూ వ్యాపారులు తమ పబ్బం గడుపుకుంటున్నారని పూల రైతులు ఆరోపించారు. పూలమార్కెట్టును మూసివేయడంతోపాటు కనీసం రోడ్డుమీద కూడా పూలు అమ్ముకోనివ్వకుండా అడ్డుకుంటూ తమ పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారుల చర్యలకు నిరసనగా కుప్పం పూల మార్కెట్టు ఎదుట గురువారం పూల రైతులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే... కుప్పంలోని ప్రైవేటు బస్టాండు వద్ద గల పూల మార్కెట్టును కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు మూడునాలుగు రోజులుగా మూతవేశారు. దీంతో కొద్దిమంది పూల రైతులు పంటను తీసుకొచ్చి పాత బస్టాండు వద్ద  రోడ్డుమీద పెట్టుకుని అమ్మకాలు సాగించారు. అయితే రోడ్డుమీద కూడా తమను పూలమ్ముకోనివ్వకుండా వ్యాపారులు అడ్డుకుంటున్నారంటూ, వారి చర్యలకు నిరసనగా గురువారం పూల రైతులు రోడ్డెక్కారు. పూల ధరలు ఇంతలా పతనం కావడానికి వ్యాపారుల సిండికేట్‌ కారణమని ధ్వజమెత్తారు. కరోనా సాకుతో మార్కెట్టు మూతవేశారని, ఇప్పుడు రోడ్డుమీద అమ్మకాలు సాగించి పొట్ట పోషించుకోవడానికి ప్రయత్నిస్తే, అదే వ్యాపారులు అడ్డుకుని పొట్ట కొట్టడం దారుణమని ధ్వజమెత్తారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండు చేశారు.

Updated Date - 2021-05-14T04:46:09+05:30 IST