ఒక్క బాయ్‌ఫ్రెండైనా ఉండాల్సిందే.. అమ్మాయిలకు కాలేజీ ‘సర్క్యులర్’

ABN , First Publish Date - 2021-01-27T19:46:23+05:30 IST

‘అమ్మాయిలూ.. మీ అందరికీ వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రండ్ అయినా ఉండాల్సిందే. ఇది మీ భద్రత కోసమే. లేకపోతే.. కాలేజీలోకి అడుగుపెట్టనీయ్యం..మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారి ఫొటోలు కూడా మాకు చూపించాలి..’ ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కాలేజీ సర్క్యులర్.

ఒక్క బాయ్‌ఫ్రెండైనా ఉండాల్సిందే.. అమ్మాయిలకు కాలేజీ ‘సర్క్యులర్’

లక్నో: ‘అమ్మాయిలూ.. మీ అందరికీ వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రండ్ అయినా ఉండాల్సిందే. ఇది మీ భద్రత కోసమే. లేకపోతే.. కాలేజీలోకి అడుగుపెట్టనీయ్యం..మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా మాకు చూపించాలి..’  ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కాలేజీ సర్క్యులర్. ఇది చాలదన్నట్టు.. ప్రేమను పంచండి అంటూ సర్యులర్ చివర ఓ సలహా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా నగరంలో గల ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనబడుతున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొ.అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారి అయినట్టు తెలుస్తోంది.


తొలుత విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో బయటపడ్డ ఈ ఆదేశాలు క్రమంగా సోషల్ మీడియా బాట పడ్డాయి. ఈ పరిణామంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా.. ఈ వ్యవహారమంతా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో ప్రిన్సిపాల్ ప్రొ. ఎస్పీ సింగ్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రొ. అశిశ్ శర్మ అనే అధ్యాపకుడు తమ కాలేజీలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని, బాధ్యులను వెతికిపట్టుకుని తగు చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే.. అమ్మాయిలను హడలెత్తించేందుకు ఫైనలియర్ విద్యార్థులెవరైనా ఈ తుంటరి పనికి పూనుకుని ఉండొచ్చని కాలేజీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక ఆగ్రాలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన సెయింట్ జాన్స్‌ను 1850లో బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. 



Updated Date - 2021-01-27T19:46:23+05:30 IST