వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయండి-ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-02-22T23:56:18+05:30 IST

రైతులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయండి-ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: రైతులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కొత్త విధానాలు, ఇన్నోవేషన్స్‌ కనుగొనడం పై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కన్ఫిడిరేషన్‌ఆఫ్‌ ఇండియా ఇండస్ర్టీస్‌ సంయుక్తంగా నిర్వహించిన అగ్రిటెక్‌-2020, అగ్రివిజన్‌-2020 సదస్సు, ప్రదర్శనను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యవసాయం మన దేశానికి వెన్నుముకఅని, మౌళిక సంస్కృతి అని అన్నారు. మన వ్యవసాయ విధానాలు ఇతర దేశాలు అనుసరించి అధిక ఉత్పత్తి, ఉత్పాదకత సాధిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చడానికి అందరూ కృషి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలనే ఎక్కువ సాగుచేస్తున్నారని, ఆ విఽధానం ఇతర పంటల సాగుకు పెరగాలన్నారు. డయాబెటీస్‌ను నియంత్రించే లక్షణాలు గల వరిసాగుని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. 


వ్యవసాయంతో పొడిపంట, కోళ్ల పెంపకం, చేపల సాగువంటివి చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తోందని ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ వ్యాప్తంగా సంప్రదాయ నీటి వనరుల పరిరోణ, పునరుద్దరణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. సమాజంలో అన్నివర్గాలు ముందుకెళుతున్నా రైతులు ఆశించిన విధంగా ముందుకెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర భ్రుత్వాలు రైతుల సంక్షేమం కోసం ఎంతో చేసినా, ఎంతో చేస్తున్నా చేయవలసింది కూడా చాలా ఉందని అన్నారు. టమాటాలు, ఆలుగడ్డలు వంటి రైతులకు గిట్టుబాటు ధరలు ఏమాత్రం రానప్పటికీ వాటి ప్రొసెస్డ్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ ధరలు ఉంటున్నాయని అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వాల్యూఎడిషన్‌ల పై ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.


తెలంగాణలో 50శాతం రైతులు ఇంకా రుణాల కోసం ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలపై ఆధారపడటం శోచనీయమని అన్నారు. సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు, నిల్వసదుపాయాలు, రోడ్లు ఇతర మౌళిక సదుపాయాలు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్నివ్యవసాయ విశ్వవిద్యాలయాలు , కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు , కొత్త టెక్నాలజీనలు , పరుగుల మందులు వంటివి కనిపెట్టి ఉత్పత్తి, ఉత్పాదకతలు  పెంచి పోషకాలతో కూడిన ఆహార భద్రత కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ, సిఐఐ తెలంగాణ ఛైర్మన్‌ డి,రాజు, అగ్రిటెక్‌ సౌత్‌-2020 ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ఏవూరు, సిఐఐ అగ్రికల్చర్‌ప్యానల్‌ కన్వీనర్‌ జివి సుబ్బారెడ్డితోపాటు వర్శిటీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-22T23:56:18+05:30 IST