వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి

ABN , First Publish Date - 2020-09-20T07:40:19+05:30 IST

రైతులను దెబ్బ తీసి, కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ఉందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి

కార్పొరేట్‌ వ్యాపారులకే లాభం 

రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించండి

టీఆర్‌ఎస్‌ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

మన దేశంలోనే పుష్కలంగా మక్కలున్నాయి

ఇంకా దిగుమతి ఎవరి ప్రయోజనం కోసం..?

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం ధ్వజం


హైదరాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతులను దెబ్బ తీసి, కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ఉందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న ఆ బిల్లును వ్యతిరేకించాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా దానిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్‌ వివరించారు.


‘‘రైతులు తమ సరుకునుఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం తీసుకువచ్చిన బిల్లులో పేర్కొన్నారు. వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా తెరవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. అన్నదాతలు తమకున్న కొద్దిపాటి సరుకును రవాణా ఖర్చులు భరించి, లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


‘‘ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నులు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఎవరి ప్రయోజనాల కోసం 35 శాతం సుంకం తగ్గించారు. ప్రస్తుత సంక్షోభం ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? మన దేశంలోనే మక్కలు పుష్కలంగా పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ దిగుమతి చేసురేంటే మన రైతుల పరిస్థితి ఏంటి?’’అని కేంద్రంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చేలా, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవసాయ బిల్లు ఉందని, రాజ్యసభలో దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ పార్టీ ఎంపీలను సీఎం కేసీఆర్‌ శనివారం ఆదేశించారు.


Updated Date - 2020-09-20T07:40:19+05:30 IST