పదవుల పందేరం

ABN , First Publish Date - 2020-11-18T04:54:27+05:30 IST

అధికార పార్టీ కార్యకర్తలకు పదవుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల సంక్షేమం పేరుతో పాలకవర్గాలను ఏర్పాటు చేశారు.

పదవుల పందేరం

వ్యవసాయ సలహా కమిటీల నియామకం

నేడు గుంటూరులో తొలి సమావేశం 

            (ఆంధ్రజ్యోతి - గుంటూరు)

అధికార పార్టీ కార్యకర్తలకు పదవుల పంపిణీ కొనసాగుతోంది.  ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల సంక్షేమం పేరుతో పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. ఆ పాలకవర్గాలకు సంబంధించి వందలమంది పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టి వారిని వైసీపీ అధిష్టానం సంతృప్తి పరిచింది. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)కు, మండల, జిల్లా వ్యవసాయ సలహా కమిటీలకు చైర్మన్లను నియమిస్తున్నారు. ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. అధికార పార్టీ నేతలను ఈ కమిటీలకు చైర్మన్లుగా నియమిస్తున్నారు. కమిటీలో వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాకమిటీకి ఆదర్శ రైతు చైర్మన్‌గా, ఇన్‌చార్జి మంత్రి గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు. రైతు సలహా కమిటీ జిల్లా చైర్మన్‌గా కాకుమాను వైసీపీ మండల కన్వీనర్‌ నల్లమోతు శివరామకృష్ణను నియమించారు.  వ్యవసాయశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి రైతు భరోసా కేంద్రాల చైర్మన్ల జాబితాను జిల్లా అధికారులకు పంపారు. విజిటింగ్‌ కార్డులు, లెటర్‌పాడ్ల కోసం మినహా ఈ పదవులకు ఏ అధికారాలు లేవని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బీకే చైర్మన్లు, జిల్లా, మండల రైతు సంక్షేమ సలహా మండళ్లు ఏర్పాటు పూర్తిగా స్ధానిక ఎమ్మెల్యే, జిల్లా, ఇన్‌చార్జి మంత్రి సిఫార్సుల మేరకే నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల, జిల్లాస్థాయిలో ఉండే ఆహార సలహా కమిటీల తరహాలోనే ఇవి ఉంటాయని చెబుతున్నారు.  జిల్లాలో 852 ఆర్‌బీకేలకు చైర్మన్ల నియామకం పూర్తయినట్లు జేడీ విజయభారతి తెలిపారు.  కమిటీ సమావేశాన్ని ఈ నెల 18 బుధవారం గుంటూరులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-18T04:54:27+05:30 IST