కాంగ్రెస్‌ చాణక్యుడు అహ్మద్‌ పటేల్‌ ఇక లేరు

ABN , First Publish Date - 2020-11-26T06:59:18+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, అపర చాణక్యుడిగా పేరొందిన అహ్మద్‌ పటేల్‌ (71) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన గత నెలలో గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కొవిడ్‌ అనంతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. శరీరంలో పలు అవయవాలు విఫలమవడంతో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి

కాంగ్రెస్‌ చాణక్యుడు అహ్మద్‌ పటేల్‌ ఇక లేరు

కొవిడ్‌తో కన్నుమూసిన సీనియర్‌ నేత 

సోనియాకు రాజకీయ సలహాదారు

హైకమాండ్‌ వాణిగా పార్టీలో పాత్ర

ఎనిమిది సార్లు పార్లమెంట్‌కు ఎన్నిక

యూపీఏ సర్కార్‌ ఏర్పాటులో పాత్ర

ఎన్నడూ మంత్రి పదవి చేపట్టని నేత

కరోనాతో ఆస్పత్రిలో మృతి.. సోనియాకు 16 ఏళ్లపాటు రాజకీయ సలహాదారు

కాంగ్రెస్‌ ప్రధాన వ్యూహకర్త.. సంక్షోభ పరిష్కర్త

యూపీఏ-ప్రభుత్వాల ఏర్పాటులో క్రియాశీలం


న్యూఢిల్లీ, నవంబరు 25: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, అపర చాణక్యుడిగా పేరొందిన అహ్మద్‌ పటేల్‌ (71) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన గత నెలలో గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కొవిడ్‌ అనంతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. శరీరంలో పలు అవయవాలు విఫలమవడంతో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాలు తెలిపారు. ‘పటేల్‌ మరణం నాకు ఊహించని షాక్‌. కాంగ్రె్‌సకు జీవితం అంకితం చేసిన వ్యక్తి. ఆయనలాంటి పార్టీ సహచరుడు మరొకరుండరు. పూర్తి విధేయుడైన పార్టీ వాది’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


కౌన్సిలర్‌ నుంచి అగ్రనేత దాక..

అహ్మద్‌ పటేల్‌ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం. తొలుత అంక్లేశ్వర్‌ తాలూకాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచారు. యువజన కాంగ్రెస్‌ నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ ఆయన్ను భారూచ్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. రాయ్‌బరేలీలో ఇందిర సహా మిగతా చోట్ల అనేకమంది దిగ్గజాలు పరాజయం పాలయ్యారు. కానీ, గుజరాత్‌లో అహ్మద్‌ పటేల్‌ గెలుపొంది సంచలనం సృష్టించారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్లే. 1989 వరకు భారూచ్‌కు పటేల్‌ లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించారు. తరువాత ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. చివరి సారి గతేడాది గుజరాత్‌ నుంచి రాజ్యసభ బరిలో దిగి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యూహాలను తనదైన శైలిలో ఎదుర్కొంటూ విజయం సాధించారు. 


తెరవెనుక శక్తిమంతుడు

అహ్మద్‌ పటేల్‌ రెండున్నర దశాబ్దాల పాటు హైకమాండ్‌ వాణిగా పార్టీలో పేరు సంపాదించారు. సోనియా వద్దకు నేరుగా వెళ్లి వ్యూహ వివరాలు తెలియజెప్పే ఏకైక నాయకుడాయన. పార్టీవాదులంతా తొలుత కలిసేది అహ్మద్‌ పటేల్‌నే. అయితే, ఎన్నడూ తెరముందుకు రాలేదు. మంత్రి పదవి కూడా చేపట్టలేదు. సీఎంలతో నేరుగా మాట్లాడడం, అవసరమైనపుడు వారిని మార్చేయడం, రాష్ట్రాల్లోని పరిణామాలపై హై కమాండ్‌ కీలక సమాచారం పొందేందుకు ఆయా రాష్ట్ర నేతలకు తెలియకుండా రహస్య నెట్‌వర్క్‌ను నిర్మించి, తగినట్లు వాడుకున్న వ్యూహ చతురత పటేల్‌ది. యూపీఏ హయాంలో సోనియానే చక్రం తిప్పేలా వ్యవస్థను మలిచారు. యూపీఏ కేబినెట్‌ నిర్మాణ కూర్పు కూడా పటేలే చేశారని చెబుతారు. ఇటీవల ఆజాద్‌ సహా 23 మంది ప్రముఖులు హై కమాండ్‌కు లేఖాస్త్రం సంధించడంపై పటేల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత అగ్గి రాజేయకుండా కొంతవరకూ నిభాయించగలిగారు. 2014, 2019ల్లో పార్టీ ఓడిపోయాక గాంధీలపై ప్రభావం పూర్తిగా పడకుండా కాపాడారు. 


యూపీఏ ఏర్పాటు వెనుక

సోనియా రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం చేసిన వ్యక్తుల్లో అహ్మద్‌ పటేల్‌ ఒకరు. 1997లో ఆమెను తొలుత శ్రీపెరంబదూర్‌ (రాజీవ్‌ హత్య జరిగిన ప్రాంతం) వెళ్లేట్లు చేయించారు. దాదాపు 16 ఏళ్లు అహ్మద్‌ పటేల్‌ ఆమెకు రాజకీయ సలహాదారు. 2004లో బీజేపీ చేపట్టిన ‘భారత్‌ వెలిగిపోతోంది’ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాన్ని రచించి సోనియాను ప్రధాన నేతగా నిలిపారు. 2004, 2009ల్లో యూపీఏ గెలుపులో పటేల్‌ విశేష కృషిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ములాయం, లాలూ ప్రసాద్‌, అజిత్‌ సింగ్‌, శరద్‌పవార్‌, కరుణానిధితో పాటు వివిధ పార్టీల నేతలను కాంగ్రెస్‌ ఛత్ర ఛాయలోకి తీసుకువచ్చి యూపీఏను గుదిగుచ్చడంలో తెరవెనుక ఎనలేని పాత్ర పోషించారు. సీడబ్ల్యూసీకి నిరవధికంగా ఎన్నికవుతూ వచ్చిన పటేల్‌ను 2018లో పార్టీ కోశాధికారిగా కూడా నియమించారు. గతేడాది మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు, రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ను శాంతింపజేసి ప్రభుత్వాన్ని కాపాడటం ఆయన శక్తి ఏపాటిదో చెబుతుంది. పటేల్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ సర్వ ప్రయత్నాలు చేసింది. వడోదరకు చెందిన ఒక కంపెనీకి సంబంధించిన కేసులో ఈడీ ఆయనను, కుమారుడు ఫైసల్‌ను విచారించింది. 


ఏమీ చెప్పకున్నా.. అంతా చెప్పినట్లే

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో చుట్టూ కూర్చున్న విలేకరులతో మెత్తగా సన్నగా మాట్లాడుతూ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన కొద్ది మాటల్లో వ్యక్తం చేసే స్పందనలే దేశ రాజధానిలో రాజకీయ కథనాలకు మూలాలు అయ్యేవి. తెలంగాణపైనే కాదు, దేశంలో జరుగుతున్న ఏ పరిణామంపైనైనా పార్టీ అధిష్ఠానం వైఖరి తెలుసుకోవాలంటే పటేల్‌ను సంప్రదించాల్సిందే. అర్థరాత్రయినా, అపరాత్రయినా ఫోన్‌ చేస్తే, లేదా ఎస్‌ఎంఎస్‌ చేస్తే క్లుప్తంగానే ఇచ్చే జవాబులో అనంతార్థాలు ఉండేవి. పటేల్‌ మరణంతో కాంగ్రెస్‌ చరిత్రలో ఓ కీలక అధ్యా యం ముగిసింది. ఓ విశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం.. ఆయన మృతితో కాంగ్రె్‌సలో సోనియా శకం కూడా ముగిసిపోయినట్లే!


పీవీతో విభేదాలు..సఖ్యత!

రాజీవ్‌ హత్యానంతరం అహ్మద్‌ పటేల్‌ను పీవీ దగ్గరకు రానివ్వలేదు. దాంతో సోనియా గాంధీకి చేరువయ్యారు. పార్టీలో ప్రముఖులందరినీ కలుపుకొనిపోయి- టెన్‌ జన్‌పథ్‌కు తీసుకెళ్లి- సోనియాకు పదేపదే విధేయత ప్రకటింపజేస్తూ పార్టీలో సమాంతర వ్యవస్థ నెలకొనేట్లు చేశారు. అయితే పీవీ చాణక్యం ముందు తేలిపోయారు. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత అర్జున్‌సింగ్‌ తదితరులు పీవీని గద్దె దింపాలని పథకం రచించినపుడు అహ్మద్‌ పటేలే అడ్డుపడ్డారు. దేశం మతతత్వ శక్తుల చేతిలోకి వెళ్లిపోయే పరిస్థితుల్లో అంతర్గత విభేదాలు మంచివి కావని చెప్పారు. సోనియా రాజకీయ అరంగేట్ర సమయంలో అటు పీవీని, ఇటు సీతారాం కేసరిని సాగనంపిన చతురత కూడా పటేల్‌దే! పీవీ భౌతిక కాయానికి ఢిల్లీలో అంత్యక్రియలు జరిపించడానికి వీల్లేదన్న సోనియా ఉద్దేశాన్ని పీవీ కుటుంబానికి తెలియజేసిందీ ఆయనే.


తెలంగాణపై నేతలను ఒప్పించి..

అది 2009 డిసెంబరు మొదటి వారం. నాటి ప్రధానమంత్రి నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశం జరుగుతోంది. అకస్మాత్తుగా అహ్మద్‌ పటేల్‌ ప్రవేశించారు. ‘మనం ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదు. పరిస్థితి ముదిరిపోతుంది’ అని కుండబద్దలు కొట్టారు. అహ్మద్‌ పటేల్‌ నుంచి నోటి నుంచి మాట వచ్చిందంటే అది సోనియా చెప్పినట్లే. తర్వాత కొద్ది రోజులకు హోంమంత్రి చిదంబరం నుంచి డిసెంబరు 9న ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వెలువడే ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌తో పటేల్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. నిజానికి తె లంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అహ్మద్‌ పటేలంత అంత సానుకూలంగా కాంగ్రె్‌సలో మరే నేతా స్పందించలేదంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి చాలా బాధపడేవారు. పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వెనుకడుగు వేశారు. మళ్లీ 2013 ద్వితీయార్థం నుంచి తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం అడుగులు వేయగా.. అతి వేగంగా పావులు క దిపి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అహ్మద్‌ పటేల్‌ చర్యలు తీసుకున్నారు. కీలక నేతలందరినీ ఒప్పించారు. రాష్ట్ర విభజనకు సుముఖంగా లేని జైరాం రమేశ్‌ తో కూడా అందుకు అనుకూలంగా పనిచేయించారు. 

Updated Date - 2020-11-26T06:59:18+05:30 IST