అహోబిలంలో అపూర్వ ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-03-09T20:29:36+05:30 IST

నల్లమల అడవుల్లో కొలువైన అహోబిలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి.

అహోబిలంలో అపూర్వ ఉత్సవాలు

నల్లమల అడవుల్లో కొలువైన అహోబిలం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. తొమ్మిది పేర్లతో నృసింహస్వామి స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అడుగడుగునా గుడి.. గుడికో దేవుడు అన్నట్లుగా వెలిసిన నవనారసింహ క్షేత్రాల విశిష్టతపై ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ...    


దేశంలోని 108 ప్రధాన వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ఒకటి. అహోబిల క్షేత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసింది. అటవీ ప్రాంతంలో కింది కొండపై వెలిసిన క్షేత్రాన్ని దిగువ అహోబిలం అని, ఎగువ కొండపై వెలిసిన క్షేత్రాన్ని ఎగువ అహోబిలం అని పిలుస్తారు. క్షేత్ర పరిధిలోని తొమ్మిది పేర్లతో నృసింహస్వామి కొలువై స్వయంభువుగా వెలియడంతో ఈ అహోబిలం క్షేత్రం నవనారసింహ క్షేత్రంగా పేరు గాంచింది. 


అహోబిలంలో వెలిసిన నవనారసింహులను ఒకేరోజు దర్శించుకుంటే సాక్షాత్తూ వైకుంఠవాసుని దర్శనం చేసుకున్నట్లేనని భక్తుల ప్రగాఢవిశ్వాసం. మహారణ్యంలోని నవనారసింహ దేవాలయాలు కాకతీయుల కాలంలోని ప్రతాపరుద్ర మహారాజు పాలనలో నిర్మించినట్లు చరిత్రలో పేర్కొనబడింది. రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉక్కు స్తంభంలో నుంచి ఉద్భవించిన స్థలమే అహోబిల పుణ్యక్షేత్రమని ప్రతీతి. 


ఉగ్ర నరసింహస్వామి.. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం.. పరమశివుడు నృసింహ మంత్రాన్ని స్తుతించి ఆయనను శాంతింపచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ఆలయానికి సుమారు 8 కిలోమీటర్ల ఎత్తులోని కొండపై వెలిసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి క్షేత్రం సమీపంలో.. చిన్న చెలిమలో ఉన్న నీరు నేటికీ ఎర్రగా రక్తం రూపంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్టను గోర్లతో చీల్చి.. అంతమొందించిన తర్వాత ఈ చెలిమెలో చేతులు కడగడంతో ఈ నీరు ఎర్రగా మారిందని భక్తులు నమ్ముతుంటారు.  


ఎంతో చరిత్ర కలిగిన ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎగువ అహోబిలంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి, దిగువ అహోబిలంలో ఫిబ్రవరి 29వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాహన సేవలు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణం వైభవంగా నిర్వహించారు. మార్చి 7వ తేదిన దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణం కన్నులపండువగా జరిగింది. మార్చి 8వ తేదీన ఉదయం ఎగువ అహోబిలంలో, 9వ తేదీన దిగువ అహోబిలంలో రథోత్సవం నిర్వహిస్తారు. మార్చి 9వ తేదీన రాత్రి ఎగువ అహోబిలంలో, మార్చి 10వ తేదీన దిగువ అహోబిలంలో  గరుడోత్సవం జరుగనుంది.  


బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా  భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అహోబిలం బ్రహ్మోత్సవాలు అంటే కేవలం భక్తజనమే కాదు ముక్కోటి దేవతలు సైతం ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని చెప్తారు. కనుక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఆలయ అధికారులు ఎగువ, దిగువ క్షేత్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 


Updated Date - 2020-03-09T20:29:36+05:30 IST