అన్నాడీఎంకే కూటమి నుంచి ఆ పార్టీ వైదొలగేనా?

ABN , First Publish Date - 2020-10-24T14:51:42+05:30 IST

అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలగనుందా? అనే విషయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు రిజర్వేషన్ల అమలు, కులాలకు ప్రత్యేక సంక్షేమ బోర్డుల ఏర్పాటుపై...

అన్నాడీఎంకే కూటమి నుంచి ఆ పార్టీ వైదొలగేనా?

చెన్నై : అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలగనుందా? అనే విషయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు రిజర్వేషన్ల అమలు, కులాలకు ప్రత్యేక సంక్షేమ బోర్డుల ఏర్పాటుపై జనవరి నుంచి ఆందోళనలు తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించడమే. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే ఏడు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమి పాలైంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూటమికి సంబంధించిన నిర్ణయాన్ని ఇంకా పీఎంకే ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో, గురువారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ ఒక  ప్రకటన  విడుదల చేశారు. ఆంధ్ర సీఎం జగన్‌ హామీ ఇచ్చినవి నేరవేరుస్తుండడంతోపాటూ  చెప్పనవి కూడా చేస్తున్నారన్నారు. అయితే అన్నాడీఎంకే పాలకులు ప్రజీ సమస్యలపై సరిగ్గా స్పందించడం లేదని దుయ్యబట్టారు. రాందాస్‌ చేసిన ఈ తాజా ప్రకటన ద్వారా అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే బయటకు వెళ్లనుందా అనే ప్రశ్న తలెత్తింది. అధికారంలో వాటా, ఉప ముఖ్యమంత్రి పదవి, ఎక్కువ నియోజకవర్గాలు కేటాయించాలనేదే పీఎంకే డిమాండ్లు. 


వాటిని ఆమోదించే పార్టీతోనే ఈ సారి పొత్తు పెట్టుకోవాలని పీఎంకే భావిస్తోంది. అయితే ఉపముఖ్యమంత్రి, అధికారంలో వాటా అనే నిబంధనలు అంగీకరానికి డీఎంకే నిరాకరించగా, అన్నాడీఎంకే కూడా దీనిపై నోరు మెదపడంలేదు. దీంతో ఒంటరిగా పోటీచేసేందుకు పీఎంకే సిద్ధమవుతున్నట్లు సమాచారం. మార్పు, అభివృద్ధి, వన్నియర్‌ అనే నినాదాలు ముందుంచి రాందాస్‌ కొన్ని పథకాలు రూపొందించారు. వన్నియర్లకు 20 శాతం రిజర్వేషన్‌ అనే హామీతో ఆ వర్గానికి చెందిన యువకులను సమీకరించేలా రాందాస్‌ వ్యూహరచన చేస్తున్నారు. పీఎంకే డిమాండ్లను డీఎంకే, అన్నాడీఎంకే అంగీకరించని పక్షంలో వన్నియర్ల ఓట్లను కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది.  వన్నియర్లకు 20 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలనే డిమాండ్‌తో  పోరాటం చేస్తామని తెలిపారు. రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రభుత్వ నుంచి ప్రకటన విడుదలైన తర్వాతే తమ పోరాటం విరమిస్తామని రాందాస్‌ తెలిపారు. 


అదే సమయంలో ఆంధ్రలో 56 రకాల వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఒక్కో కులానికి ఒక్కో సంక్షేమ బోర్డు ఉందని, రాష్ట్రంలో కులాల వారీగా జనగణన చేపట్టి ఒక్కో కులానికి ప్రజా సంఖ్యను బట్టి రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎంబీసీల్లో ఉన్న 263 కులాల్లో ఏఏ కులాల్లో 30 వేల మంది ఉంటారో, ఆయా కులాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని రాందాస్‌ డిమాండ్‌ చేశారు. ఇవన్నీ అధికారపార్టీకి సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంకే డిమాండ్లను అన్నాడీఎంకే అంగీకరిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-10-24T14:51:42+05:30 IST