DMK, AIADMK అసెంబ్లీ ఎన్నికల ఖర్చు ఎన్ని కోట్లంటే..

ABN , First Publish Date - 2021-10-04T17:42:58+05:30 IST

గత ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది....

DMK, AIADMK అసెంబ్లీ ఎన్నికల ఖర్చు ఎన్ని కోట్లంటే..

చెన్నై : గత ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. డీఎంకే తరఫున ఎన్నికల ఖర్చు వివరాల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఎన్నికల సంఘానికి సమర్పించారు. శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత డీఎంకేకు రూ.134 కోట్ల మేర విరాళాలు వచ్చాయని, అందులో 114.14 కోట్లను ఎన్నికల నిమిత్తం ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థులు 188 మందికి తలా రూ.25లక్షల చొప్పున మొత్తం 48.75 కోట్లను అందజేసినట్టు వివరించారు. పుదుచ్చేరిలో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థులు 13 మందికి తలా రూ.15 లక్షలు కేటాయించినట్టు పేర్కొన్నారు. డీఎంకే ఎన్నికల ప్రచారానికి సలహాదారుగా వ్యవహరించిన ఐపేక్‌ సంస్థకు రూ.5 కోట్లు, పత్రికలు, ఎలక్ర్టానిక్‌ మీడియా ద్వారా ప్రచా రాలకు రూ.39.78 కోట్లు, పోస్టర్లు, తొరణాల ఏర్పాట్లు, కటౌట్ల కోసం రూ.12.34 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు దురైమురుగన్‌ తెలిపారు.  డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఎన్నికల ప్రచారానికి విమానాన్ని ఉపయోగించినందుకు రూ.2.25కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.


అన్నాడీఎంకే...

కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నాడీఎంకే గత జూలై ఏడున సమర్పించిన ఎన్నికల ఖర్చుల వివరాల ప్రకారం ఆ పార్టీ రూ.57 కోట్ల వరకూ ఖర్చు చేసింది. ఎన్నికల నోటిషికేషన్‌కు ముందే అన్నాడీఎంకే ఖాతాల్లో రూ.266 కోట్ల మేర నిధులున్నాయని, నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత రూ.14.46 కోట్ల మేరకు పార్టీకి విరాళాల రూపంలో అందాయని పేర్కొన్నారు. పార్టీ తరఫున పోస్టర్ల ప్రచారం, ఎలక్ర్టానిక్‌ మీడియాల్లో ప్రచా రం తదితరాలకు రూ.56.65 కోట్ల మేరకు ఖర్చుచేసినట్టు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ ఉపయోగించినందుకుగాను రూ.13.23 లక్షల దాకా ఖర్చు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-10-04T17:42:58+05:30 IST