తమిళనాట 52 రోజుల వివాదానికి తెర వీడింది!

ABN , First Publish Date - 2020-10-08T15:16:30+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా

తమిళనాట 52 రోజుల వివాదానికి తెర వీడింది!

  • అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి 
  • పట్టుబట్టి కమిటీ సాధించిన ఓపీఎస్‌

చెన్నై : వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎంపికయ్యారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన పార్టీనేతలు, మంత్రుల సమావేశంలో పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ఈ మేరకు ప్రకటించారు. దీంతో సీఎం అభ్యర్థి ఎంపికపై 52 రోజులపాటు సాగిన వివాదాలకు తెరబడింది. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మూడేళ్ళ క్రితం తాను ప్రతిపాదించిన మార్గదర్శక కమిటీని పట్టుబట్టి సాధించుకోగలిగారు. ఆ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఓపీఎస్‌ చిరకాల కోరికను ఆమోదించారు.


11 మందితో పార్టీ మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.  ఆగస్టు 15 తేనిలో కాబోయే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అంటూ ఆయన అభిమానులు ముద్రించిన పోస్టర్‌ కారణంగా పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం నడుమ విబేధాలు చోటుచేసుకున్నాయి. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా వుంటూ ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని స్థిరంగా నడుపుతున్న తానే సీఎం అభ్యర్థినని ఎడప్పాడి చెబుతూ వచ్చారు. అదే సమయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనపై ఎంతో విశ్వాసంతో మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించానని, కనుక సీఎం అభ్యర్థికి తానే సమర్థుడనని పన్నీర్‌సెల్వం తెలిపారు. సెప్టెంబరు 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఇద్దరూ ఈ విషయంపై వాగ్వాదానికి దిగడంతో పార్టీ నేతలు, సీనియర్‌ మంత్రులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ సమావేశం తరువాత పన్నీర్‌సెల్వం అలకబూనారు. ఎడప్పాడి పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. 


ఐదు రోజుల క్రితం ఉన్నట్టుండి తన స్వస్థలమైన పెరియకుళంకు వెళ్ళి రెండు రోజులపాటు కైలాసపట్టిలోని తన ఫామ్‌హౌస్‌లో మద్దతుదారులతో సుదీర్ఘ చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఆయన చెన్నై చేరుకున్నారు. రెండు రోజులపాటు అడయార్‌ గ్రీన్‌వేస్‌ రోడ్డులో ఉన్న పన్నీర్‌సెల్వం నివాసంలో సీనియర్‌ మంత్రులు, పార్టీ ప్రముఖులు పలు విడతలుగా చర్చలు జరిపారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా తాను నిర్ణయం తీసుకుంటానని పన్నీర్‌సెల్వం ప్రకటించడం కూడా ఎడప్పాడి వర్గంలో కలవరం సృష్టించింది.  చివరి నిమిషంలో పన్నీర్‌సెల్వం మళ్ళీ ధర్మయుద్ధం అంటూ పార్టీ నుంచి వైదొలగుతారేమోనని ఆందోళన చెందారు. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వేకువజాము రెండు గంటల వరకు పార్టీ డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి, జీసీడీ ప్రభాకరన్‌, మనోజ్‌ పాండియన్‌ తదితరులు పన్నీర్‌సెల్వం నివాసంలో పలు విడతలుగా చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మంత్రులు తంగమణి, వేలుమణి, జయకుమార్‌, సీవీ షణ్ముగం, ఉదయకుమార్‌ తదితరులు పన్నీర్‌సెల్వంను కలుసుకుని చర్చలు సాగించారు. తరువాత పన్నీర్‌సెల్వం నివాసం నుంచి బయల్దేరిన మంత్రులు దిడుగల్‌ శీనివాసన్‌, పి.తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్‌, సీవీ షణ్ముగం, కేపీ అన్బళగన్‌, ఆర్బీ ఉదయకుమార్‌ ముఖ్యమంత్రి పళనిస్వామితో చర్చలు జరిపారు. 


మార్గదర్శక కమిటీ ఏర్పాటు కోసం పన్నీర్‌సెల్వం పట్టుబడుతున్నట్లు మంత్రులు ఎడప్పాడికి తెలిపారు. ఆ కమిటీని ఏర్పాటు చేయడానికి ఎడప్పాడి అంగీకరించారు. ఈ వివయాన్ని పార్టీ డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి ద్వారా పన్నీర్‌సెల్వంకు తెలియజేశారు.. చివరకు పార్టీలో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేస్తామని, పార్టీ సమన్వయకర్తగా మరిన్ని అధికారాలు కల్పిస్తామని ఎడప్పాడి తరపున పన్నీర్‌సెల్వంకు మంత్రులు హామీ ఇచ్చారు. మరోమారు మంత్రులు సెంగోటయ్యన్‌, కడంబూరు రాజు, ఉడుమలై రాధాకృష్ణన్‌, మాజీ మంత్రి నత్తం విశ్వనాధన్‌ తదితరులు పన్నీర్‌సెల్వంను కలుసుకుని అతడిని  శాంతింపజేశారు. ఈ నేపథ్యంలో యాభైరోజులకు పైగా పట్టిన పట్టును పన్నీర్‌సెల్వం సడలించారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటించడం కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిపేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయి. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి మధ్య విబేధాలు సమసిపోయాయని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో బుధవారం ఉదయం 9.30 గంటలకు అన్నాడీఎంకే కార్యాలయం వద్ద గుమికూడారు.  


ముందుగా ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కారులో పార్టీ కార్యాలయం చేరుకున్నారు. వెంటనే కార్యకర్తలంతా పన్నీర్‌సెల్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆయన కారుపై పూలవర్షం కురిపించారు. కార్యాలయం ఎదుట నున్న మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌. జయలలిత విగ్రహాలకు పన్నీర్‌సెల్వం నివాళులర్పించి కార్యాలయంలోనికి వెళ్ళారు. కాసేపటికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ కార్యాలయానికి వచ్చారు. కార్యకర్తలు ఆయనకు కూడా ఘనస్వాగతం పలికారు. ఇక డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి పార్టీ మార్గదర్శక కమిటీ ఏర్పాటుపై ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటిస్తారని, సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటిస్తారని చెప్పగానే కార్యకర్తలంతా చప్పట్లు చరిచారు.  తరవాఆత పార్టీ కార్యాలయంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ సహా పార్టీ ప్రీసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌, డిప్యూటీ సమన్వకర్తలు కేపీ మునుసామి, వైద్యలింగం మంత్రులు సమావేశమయ్యారు.


తొలుత కమిటీపై ప్రకటన

ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి లేచి పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రతిపాదన మేరకు పార్టీలో 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ మార్గదర్శక కమిటీలో మంత్రులు దిండుగల్‌ శీనివాసన్‌, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్‌, సీవీ షణ్ముగం, ఆర్‌.కామరాజ్‌, మాజీ ఎమ్మెల్యే జీసీడీ ప్రభాకరన్‌, మాజీ ఎంపీ పీహెచ్‌ మనోజ్‌పాండ్యన్‌, మాజీ మంత్రి మోహన్‌, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌, చోళవందాన్‌ ఎమ్మెల్యే మాణిక్కం సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వివరించారు.


ఓపీఎస్‌ ప్రకటన...

మార్గదర్శక కమిటీ ఏర్పాటైన తర్వాత పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఉద్వేగంగా ప్రసంగించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో నూతన విప్లవాన్ని కలిగించారని, వారి అడుగుజాడల్లో తామంతా నడవాల్సి ఉందని చెప్పారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌, డిప్యూటీ సమన్వయకర్తలు, మార్గదర్శక కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు, సభ్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత వచ్చేయేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయనున్న సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపికచేశామని తెలిపారు. సీఎం అభ్యర్థిగా పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును సంతోషంగా ప్రకటిస్తున్నానన్నారు. ఈ ప్రకటన చేయగానే సభలో చప్పట్లు మిన్నుముట్టాయి. పన్నీర్‌సెల్వం వర్థిల్లాలి, ఎడప్పాడి వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత పన్నీర్‌సెల్వంను ఎడప్పాడి, ఎడప్పాడిని పన్నీర్‌సెల్వం పరస్పరం సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీ కార్యాలయం వెలుపల గుమికూడిన వేలాదిమంది కార్యకర్తలు కూడా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు.


జయ సమాధివద్ద నివాళి...

అన్నాడీఎంకే కార్యాలయంలో సమావేశం ముగియగానే ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు కార్లలో మెరీనాకు బయల్దేరారు. బీచ్‌లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ సమాధి వెనుకవైపున ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మంత్రులు నివాళులర్పించారు.

Updated Date - 2020-10-08T15:16:30+05:30 IST