అన్నాడీఎంకేను ఖతం చేయడానికే... బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-07T16:31:50+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది.

అన్నాడీఎంకేను ఖతం చేయడానికే... బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో పాటు ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. చర్చలు అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అళగిరి ప్రకటన చేశారు.


మరోవైపు బీజేపీపై మండిపడ్డారు తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దినేశ్ గుండూ రావు. అన్నాడీఎంకేతో చేతులు కలిపింది... ఆ పార్టీని ఖతం చేయడానికేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకవ్యక్తి పాలన కిందకు దేశాన్ని తీసుకు రావడానికి ఆ పార్టీ యోచిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి జయకేతనం ఎగరవేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. 


ఇదిలా ఉంటే, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ ఆరున జరిగే పోలింగ్ జరగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.  డీఎంకే, కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు, ఎండీఎంకే, వీసీకే, ఐయూఎం, ఎంఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కేటాయించారు. 

Updated Date - 2021-03-07T16:31:50+05:30 IST