విలీనం కత్తి!

ABN , First Publish Date - 2021-10-27T06:42:25+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్‌ నిధులతో 160 పాఠశాలలు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్నాయి. ఇందులో 82 ప్రాథమిక, 32 ప్రాథమికోన్నత, 46 హైస్కూళ్లు కొనసాగుతున్నాయి.

విలీనం కత్తి!
కాకినాడ జగన్నాథపురంలో ఎమ్మెల్యే ద్వారంపూడిని చుట్టుముట్టి ప్రశ్నిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

జిల్లాలో 160 ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి ఆదేశాలు

వీటన్నింటి విలీనానికి చకచకా పావులు కదుపుతున్న ప్రభుత్వం

ఇప్పటికే ప్రభుత్వంలో కలవడానికి 68 పాఠశాలలు అంగీకారం

ఏడు ఎయిడెడ్‌ స్కూళ్లు మాత్రమే ప్రభుత్వానికి ఆస్తుల స్వాధీనానికి అంగీకారం

మొత్తం 686 మంది బోధన సిబ్బంది, 16,786 మంది విద్యార్థులపై విలీన ప్రభావం

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మరికొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం

ఎయిడెడ్‌ను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రుల ససేమిరా

జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచీ విద్యా బోధన సాగిస్తున్న ఎయిడెడ్‌ స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విలీనం కత్తి వేలాడ దీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఎయిడెడ్‌ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో అందులో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో ఎప్పుడు.. ఎక్కడ.. ఏ రూపంలో విద్యార్థులు, తల్లిదండ్రుల సెగ తగులుతుందోనని వైసీపీ ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ జగన్నాథపురంలో కొనసాగుతున్న సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాలను ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా రోడ్డెక్కారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడిని చుట్టుముట్టారు. ఈనేపథ్యంలో జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై మరోసారి చర్చ జరుగుతోంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్‌ నిధులతో 160 పాఠశాలలు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్నాయి. ఇందులో 82 ప్రాథమిక, 32 ప్రాథమికోన్నత, 46 హైస్కూళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటిని ప్రభుత్వం విలీనం చేసుకునేందుకు విద్యాశాఖ చకచకా పావులు కదుపుతోంది. అటు ప్రభుత్వం కూడా కొంతకాలంగా ఎయిడెడ్‌ స్కూళ్లకు నిధులు నిలిపివేసింది. దీంతో ఆర్థిక సమస్యలతో ఇవి కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి వేతనాల ఇవ్వలేక చివరకు పిల్లల వద్ద ఫీజులు కూడా వసూలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నాడు-నేడు కింద అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసినందున, ఇకపై ఎయిడెడ్‌ పాఠశాలను ప్రోత్సహించడం సరికాదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఆ స్కూళ్లను విలీనం చేసుకునేందుకు అడు గులు వేస్తోంది. దీంతో వాటికి నిధులు నిలిపివేయడంతోపాటు అందు లో చదువుతున్న బోధన సిబ్బందికి ప్రభుత్వమే ఇకపై జీతాలు ఇవ్వ డంతోపాటు అందులో చదువుతున్న విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై ఆయా తల్లిదండ్రుల నుంచి అభ్యంతరా లు వ్యక్తం అవుతున్నాయి. ఎయిడెడ్‌ పాఠశాల్లో ఎనభై శాతం వరకు క్రైస్తవ, హిందూ సంస్థలు నిర్వహించేవే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇవి అనేక పద్ధతుల్లో కఠినంగా విద్యాబోధన చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని ప్రభుత్వంలో విలీనం చేస్తే పిల్లల చదువులు దెబ్బతింటాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు దెబ్బతినే ప్రమాదం ఉందని వీరంతా ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్ణయంతో విలీనం అయ్యే ప్రభుత్వ పాఠశాలను కాదని, ఇప్పుడు ఎక్కువ డబ్బులు వెచ్చించి వేరే ప్రైవేటు స్కూళ్లలో చదవించి ఎలా తట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. స్కూలు కూడా దూరం అవుతుందని, అలాగే భద్రత మాటేంటని మండిపడుతున్నారు. మరోపక్క జిల్లాలో గుర్తించిన 160 ఎయిడెడ్‌ పాఠశాలలతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం చివరకు 68 ఎయిడెడ్‌ స్కూళ్లను విలీనం చేసుకునేందుకు వారి నుంచి సమ్మతి లేఖలు పొందింది. అయితే తమ స్కూలు ఆస్తు లు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇవి అంగీకరించలేదు. దీంతో ఇందులో చదువుతున్న పిల్లలను వేరే ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కేవలం ఏడు ఎయిడెడ్‌ స్కూళ్లు మాత్రమే ప్రభుత్వానికి అప్పగించడానికి సమ్మతించాయి. దీంతో వీటిని ప్రభుత్వ పాఠశాలగా మార్చి బోధన కొనసాగించనున్నారు. మరికొన్ని ఎయిడెడ్‌ స్కూళ్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మొత్తం ఎయిడెడ్‌ స్కూళ్ల విలీనం ద్వారా 686 మంది సిబ్బంది, 16,727 మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. అయితే ఈ స్కూళ్లబోధన సిబ్బందిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.



Updated Date - 2021-10-27T06:42:25+05:30 IST