కాలగర్భంలోకి ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలలు

ABN , First Publish Date - 2021-04-16T05:53:39+05:30 IST

మహాపండితులు నడయాడిన విజయనగరం ఎమ్మార్‌ కళాశాల, ‘జనగణమన’కు స్వరకల్పన జరిగిన మదనపల్లి బి.టి కళాశాల, విశ్వవిద్యాలయానికి దీటైన ఏలూరు...

కాలగర్భంలోకి ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలలు

మహాపండితులు నడయాడిన విజయనగరం ఎమ్మార్‌ కళాశాల, ‘జనగణమన’కు స్వరకల్పన జరిగిన మదనపల్లి బి.టి కళాశాల, విశ్వవిద్యాలయానికి దీటైన ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాల, బోధివృక్షాలనదగ్గ ఎ.సి., లయోలా కళాశాలలు, విరుద్ధ భావాల సంగమం కావలి జవహర్‌భారతి కాలగర్భంలోకి జారిపోతున్నాయి. ఆంధ్రదేశంలో తొలితరం విద్యాధికులందరికీ జ్ఞానభిక్ష పెట్టిన ఎయిడెడ్‌ కళాశాలలన్నీ త్వరలో స్మృతిశకలాలుగా మారుతున్నాయి.


రాష్ట్రంలో 1347 మంది అధ్యాపకులతో, లక్షాపాతిక వేల మందికి పైగా విద్యార్థులతో 152 డిగ్రీ కళాశాలలు; 720 మంది అధ్యాపకులతో, 80వేల మంది విద్యార్థులతో 120 జూనియర్‌ కళాశాలలు, 7298 మంది ఉపాధ్యాయులతో, రెండున్నర లక్షల మంది పిల్లలతో 3827 పాఠశాలలు ఎయిడెడ్‌ యాజమాన్యాలవి నడుస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా టీచర్ల నియామకాలు నిలిపి వేసినా, ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు చుట్టుముట్టినా ఇంకా ఇవి నిటారుగా నిలబడేవున్నాయి.


ఇప్పుడు ప్రభుత్వం వీటన్నిటికి మంగళం పాడాలని నిర్ణయించింది. ఒక పథకం ప్రకారం ‘మీరు ఆస్తులతో సహా మీ సంస్థల్ని ప్రభుత్వానికికైనా అప్పజెప్పండి. ఎయిడ్‌ ఉపసంహరణనైనా ఎదుర్కోండి’ అంటూ ఒక హుకుం జారీచేసింది. యాజమాన్యాలు ఆస్తులు అప్పజెప్పవు గాబట్టి ఆచరణలో జరిగేది ఎయిడ్‌ ఉపసంహరణ మాత్రమే. ఈ తంతు ముగించడానికి ప్రభుత్వం ఏప్రిల్‌ 6వ తేదీన ప్రొ. రత్నకుమారిగారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి వారం రోజుల్లో నివేదికనిమ్మని కోరింది.


ఎయిడ్‌ను ఉపసంహరించుకోడానికి ప్రభుత్వం మూడు కారణాలు చెపుతోంది. ఒకటి విద్యార్థుల ప్రవేశాలు బాగా తగ్గుతున్నాయి. రెండు అధ్యాపకుల వేతనాలు, రెగ్యులరైజేషన్‌ డిమాండ్లు ఆర్థిక భారంతో కూడుకున్నవి. మూడు యాజమాన్యాలు వీటిని నడపలేకపోతున్నాయి. ఇక మూసివేతే మార్గం కాబట్టి న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్ళనెదుర్కొవాలి. దీనికోసం ఈ కమిటీని నియమించింది. 


ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గొప్ప చారిత్రక నేపథ్యముంది సామాజిక భూమిక ఉంది. కేరళలో ప్రభుత్వ సంస్థలకంటె ఎయిడెడ్‌ సంస్థలే ఎక్కువ. ఇవి లేని తమిళనాడు ఉన్నత విద్యను ఉహించుకోలేం. కర్ణాటకలోని మఠాలు మహావిద్యా సంస్థలుగా ఎదిగి, అట్టడుగు వర్గాలకు అక్షరబిక్ష పెట్టడం ఒక ధర్మంగా పాటిస్తున్నాయి. జాతీయోద్యమ వారసత్వంగా పుట్టిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మత సామాజిక దాతృత్వ సేవా సంస్థల చొరవతో దేశమంతటా విస్తృతంగా అల్లుకుపోయాయి. అద్భుతమైన మౌలిక వసతులు సమకూర్చుకోగలిగాయి, విస్తృత సామాజిక మద్దతు లభించడంతో మహావృక్షాలుగా ఎదిగాయి. నియామాకాల్లో రాజకీయ బ్యురాక్రటిక్‌ జోక్యాలకు, సంక్షిష్ట నిబంధనలకు తావులేకపోడంతో యాజమాన్యాలు గొప్ప విద్వాంసుల్ని, మేధావుల్ని ఎంపిక చేసుకోగలిగాయి. సమర్ధంగా నడపగలిగాయి. అకడమిక్‌ స్వేచ్ఛనివ్వగలిగాయి. ఈ దృష్టితో చూస్తే ప్రస్తుత వ్యాపార కార్పొరేట్‌ సంస్థలకూ వీటికీ పోలికే లేదు. ప్రభుత్వ సంస్థలు కూడా వీటి దరిదాపులకు చేరలేవు. ఒక్కసారి టిటిడి పద్మావతి మహిళా కళాశాలనో, విజయవాడ స్టెల్లా కాలేజీనో గుర్తుకు తెచ్చుకోండి. ఇలాంటివి ఒక్కటంటే ఒక్కటైనా ప్రభుత్వం నడపగలదా? ఒక్క ప్రాచ్య కళాశాలనైనా ప్రభుత్వం పెట్టగల్గిందా?


దేశంలో ఎక్కడా లేనట్టు తెలుగునాట మాత్రమే ఎయిడెడ్‌ విద్యాసంస్థలెందుకు శల్యావశిష్టంగా మారాయి? దీనికి ప్రభుత్వాలు పనిగట్టుకొని చేసిన రాజకీయ విధ్వంసమే కారణం. ఈ ధ్వంసరచన 1999–-2005 మధ్య పరాకాష్టకు చేరింది. ఒక ప్రభుత్వం ప్రపంచబ్యాంకుతో ఒప్పందంలో భాగంగా ఎయిడెడ్‌ పోస్టుల భర్తీని నిలిపేసింది. నియామకాల్లో అవకతవకలు, కోర్టు జోక్యాలు లాంటి సాకుల్ని అడ్డం పెట్టుకొని మరో ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగించింది. మధ్యలో చాలా ఆందోళనలు జరిగాయి. చర్చలు నడిచాయి. అధ్యయనాలు సాగాయి. రేషనలైజేషన్‌ చేసి పోస్టులు భర్తీ చేద్దామన్న ఆలోచన కూడా ముందుకొచ్చింది. కానీ ఒక్కడుగూ ముందుకు పడలేదు. దీంతో పాఠశాలలు కళాశాలలు మన తెలుగు రాష్ట్రాల్లో కోలుకోలేని దెబ్బతిన్నాయి. 


ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఒక చారిత్రక సందర్భంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో వెలిశాయి. ఆ ప్రాంత ప్రజల విద్యావసరాల్ని తీర్చాయి. అందువల్ల ప్రభుత్వం అక్కడ పాఠశాలల్ని, కళాశాలల్ని పెట్టే అవసరం రాలేదు. ఇప్పుడు వీటిని మూసెయ్యడమో, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు (వ్యాపార) సంస్థలుగా మార్చడమో జరిగితే ఈ ప్రాంతపు పేదపిల్లలేమవుతారు? ఇవి మంచి హాస్టళ్ళను నడుపుతున్నాయి. దూరం నుంచి పేదపిల్లలు, మరీ బాలికలు వేలమంది వీటిలో ఉండి చదువుకొంటున్నారు. ప్రభుత్వం వీటికి ఏ ప్రత్యామ్నాయం చూపగలదు?


ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఏ లోపాలూ లేవని గాదు. కొత్త కోర్సులతో ప్రజల సమకాలీన ఆకాంక్షలకు తగ్గట్టుగా మారలేకపోవడం వీటి మొదటి లోపం. దీంతో కార్పొరేట్‌ ప్రైవేటు సంస్థల పోటీకివి తట్టుకోలేకపోయాయి. యాజమాన్యాల స్వభావంలో, దృక్పథంలో కూడా చాలా మార్పులొచ్చాయి. కొత్త వారసులకు ఆస్తులమీద మక్కువ ఎక్కువైంది. సమర్థంగా నడపడం మీద ఆసక్తి తగ్గింది. అన్నిటికంటె మించి అన్‌ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల వేతనాలు వీరికి భారమైపోయాయి. చిన్ని చిన్న స్కూళ్ళ అవసరం మరీ తగ్గిపోయింది. నియామకాలు లేక అధ్యాపకుల సంఖ్య నానాటికీ కుదించుకుపోయింది. కళ్ళముందే తమ వ్యవస్థ కనుమరుగవుతున్నా కన్నీళ్ళు గుక్కుకోడం తప్ప వీళ్ళేమీ మాట్లాడలేకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలోకి మారితే గౌరవప్రదంగానైనా బ్రతకొచ్చుననే స్థితికొచ్చారు. కానీ అదీ అంత సజావుగా జరిగేలా లేదు. వీళ్ళని పోస్టులతో సహా తీసుకోబోమని, ఖాళీల్లో సర్దుబాటు మాత్రమే చేస్తామని, వీలినమవుతామనే భ్రమలు పెట్టుకోవద్దని ప్రభుత్వం చెపుతోంది. దీంతో ఒక్క కలంపోటుతో దాదాపు పాతికవేల ఎయిడెడ్‌ పోస్టులు రద్దవుతాయి. ప్రభుత్వ సంస్థల్లోని ఖాళీల్ని భర్తీ చెయ్యడం శాశ్వతంగా వాయిదా పడుతుంది. ఇక మిగిలింది రెగ్యులరైజ్‌ అవుతామని ఎదురుచూస్తూ వెట్టిచాకిరీ చేస్తున్న 2000 మంది అన్‌ఎయిడెడ్‌ అధ్యాపకులు. ప్రభుత్వం వీరిని తన ఉద్యోగులే కాదంటోంది. చిమ్మచీకటి తప్ప వీళ్ళకేమీ మిగిలేలా లేదు.


ఇక ‘బిలియన్‌’ డాలర్ల మార్క్‌ ప్రశ్న వీటి ఆస్తులది. నగరాల నడిబొడ్డున ఎయిడెడ్‌ సంస్థలకు బంగారంలాంటి భూములున్నాయి. సువిశాల భవనాలున్నాయి. యుజిసి, రూసా నిధులతో సమకూరిన మంచి మౌలిక వసతులున్నాయి. వీటి విలువ వేల కోట్లలో వుంటుంది. ఇవన్నీ ఈ సంస్థలకు ఎలా సంక్రమించాయో ఎక్కడా రికార్డులు లేవు. వీటిలో తొంభైశాతం దాతలు, ప్రభుత్వాలు సమకూర్చినవి. లాభాపేక్ష లేకుండా విద్యాభివృద్ధికి తోడ్పడాలని, పేదలకు జ్ఞాన భిక్షపెట్టాలని అందజేసినవి. ప్రస్తుత యాజమాన్యాలకు వీటితో ఏ సంబంధమూ లేదు. ప్రభుత్వం ఎయిడ్‌ ఉపసంహరించుకొన్న మరుక్షణం యాజమానులకు వీటిపై సర్వాధికారాలు సంక్రమిస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకంటే ప్రభుత్వానికే బాగా తెలసు!


ఇప్పుడు మన ముందున్నవి రెండు ప్రశ్నలు. ఒకటి దేశంలో ఎక్కడా లేనట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనేది మొదటి ప్రశ్న. ‘ఎంత బలహీనపడ్డా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని పునరుజ్జీవింపజేసే మార్గమే లేదా’ అనేది రెండో ప్రశ్న. మొదటి దాన్ని పక్కనబెట్టి వాస్తవిక దృష్టితో రెండో ప్రశ్నకు సమాధానం వెతుకుదాం.


ఎయిడెడ్‌ కళాశాలల్లో పాఠశాలల్లో కొన్నిటికి కాలం చెల్లిన మాట వాస్తవం. చిన్న చిన్న ప్రాథమిక పాఠశాలలు, మంచి ప్రభుత్వ పాఠశాలల ప్రక్కనే ఏ వసతుల్లేకుండా కునారిల్లుతున్న పాఠశాలలు, వ్యక్తులు కుటుంబాలు బతుకుతెరువు కోసం నడుపుతున్న సంస్థలు ఈ కోవలోకి వస్తాయి. వీటి అవసరం ఇక లేకపోవచ్చు.


మిషనరీలు, దాతృత్వ సేవా సంస్థలు చరిత్రగల్గిన యాజమాన్యాలు నానాకష్టాలు పడి నడుపుతున్నవి, అన్ని హంగులు కలవి రెండోరకం. వీటికి కేరళలోలాగా సాయమందిస్తే, పోస్టులు భర్తీచేస్తే అత్యున్నత విద్యాసంస్థలుగా విరాజిల్లుతాయి. ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థలేవీ వీటికి సాటిరాలేవు. ఇక దేవాదాయశాఖ భవనాల్లో ఆస్తులతో నడుపుతున్న సంస్థలు. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలతో పాటు వీరేశలింగంగారి సంస్థలు ఈ తరగతిలోకి వస్తాయి. వీటిని నేరుగా ప్రభుత్వమే నడుపవచ్చు. ఆధునికంగా తీర్చిదిద్దవచ్చు, మంచి సేవాసంస్థలకో, సొసైటీలకో అప్పజెప్పనూవచ్చు. 


చివరగా నియామకాల విధివిధానాల్లో కూడా మార్పులు రావాలి. అందరితో చర్చించి యాజమాన్యాల స్వేచ్ఛకు భంగం కలగకుండానే ఒక పారదర్శక విధానాన్ని రూపొందించాలి. యాజమాన్యాలు కూడా తమ ధోరణి మొత్తం ఎయిడెడ్‌ వ్యవస్థకే ముప్పు తెస్తోందని గుర్తించాలి. 


ఇప్పుడు కావల్సింది ఒక సానుకూల దృక్పథం, దార్శనికత. వ్యవస్థల్ని కూల్చెయ్యడం సులువు. పునరుద్ధరించడం చాలాకష్టం. భారతదేశ విద్యారంగంలో ఇప్పటికీ ఎయిడెడ్‌ వ్యవస్థకు కాదనలేని స్థానం ఉన్నదని ప్రభుత్వం, సమాజం రెండూ మనసారా నమ్మాలి. ఈ నమ్మకం ఉంటే పునరుజ్జీవనం పెద్ద సమస్యే కాదు.

వి.బాలసుబ్రహ్మణ్యం

శాసనమండలి సభ్యులు

Updated Date - 2021-04-16T05:53:39+05:30 IST