‘ఎయిడెడ్‌’ ఉపసంహరణ బిల్లు సిద్ధం

ABN , First Publish Date - 2021-05-19T09:25:49+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ‘ఎయిడెడ్‌’ విద్యాసంస్థల నియంత్రణ, స్వాధీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు మాత్రమే ఉండాలని భావిస్తోంది...

‘ఎయిడెడ్‌’ ఉపసంహరణ బిల్లు సిద్ధం

  • విద్యాసంస్థల నియంత్రణే లక్ష్యం
  • రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే వీలు!

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ ‘ఎయిడెడ్‌’ విద్యాసంస్థల నియంత్రణ, స్వాధీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు మాత్రమే ఉండాలని భావిస్తోంది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఉండకూడదన్నది నిర్ణయం. ఇందులోభాగంగా ఉన్నత విద్యాశాఖ ‘ఎయిడెడ్‌’ ఉపసంహరణ బిల్లును సిద్ధం చేసింది. ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నింటినీ ఈ బిల్లులో పేర్కొంటున్నారు. ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎయిడెడ్‌ విద్యా సంస్థల పనితీరు సవ్యంగా లేదని, పూర్తిగా గాడి తప్పిందని భావిస్తోన్న సర్కారు..వాటిల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి తీసుకోనున్నట్లు చెబుతోంది. దీర్ఘకాలంగా ఎయిడెడ్‌ సంస్థలకు ఇస్తోన్న గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను ఉపసంహరించుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆస్తుల స్వాధీనం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. న్యాయపరమైన సమస్యలు వస్తాయన్న భావనతో ప్రస్తుతానికి ఆ అంశం జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌-1982 మేరకే చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రైవేట్‌ సంస్థలకు ఎయిడ్‌ ఇవ్వడం లేదా తగ్గించడం లేదా ఉపసంహరించుకోవడం.. అనేవి తన అధికారం కిందకు వస్తుందని చెబుతోంది. ఇందుకు గత కేబినెట్‌ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. గత కొంతకాలంగా ఆయా విద్యా సంస్థల స్వాధీనానికి సంబంధించి యాజమాన్యాలనుంచి ‘సమ్మతి’ లేఖలు కోరుతోంది. సిబ్బందితోపాటు  స్థిర, చర ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా? కేవలం సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చి సంస్థను ప్రైవేట్‌గా నిర్వహించుకుంటారా? అని అడిగింది. తాజా సమాచారం ప్రకారం  స్థిర, చర ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు సింహభాగం మేనేజ్‌మెంట్లు విముఖత వ్యక్తంచేశాయి. ఎయిడెడ్‌ సెక్షన్లలో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, తామే ప్రైవేట్‌గా సంస్థలను నిర్వహించుకునేందుకే సుముఖత తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఎయిడెడ్‌ సంస్థల యాజమాన్యాలు సంస్థల్లోని స్థిర, చర ఆస్తులను విద్యా సంబంధమైన కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలని ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తుల్లో దాతలు ఇచ్చిన విరాళంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ కూర్చిన నిధులతో ఏర్పాటుచేసుకున్నవి కూడా ఉన్నాయని స్పష్టం చేస్తోంది.

Updated Date - 2021-05-19T09:25:49+05:30 IST