ఎత్తివేతకే పై ఎత్తు

ABN , First Publish Date - 2021-10-14T05:08:51+05:30 IST

కోర్టు ఆదేశాల మేరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిలిపివేతపై వెనక్కి తగ్గినప్పటికీ ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలోకి విలీనం చేసే ప్రయత్నాలను మాత్రం విద్యాశాఖ కొనసాగిస్తూనే ఉంది.

ఎత్తివేతకే పై ఎత్తు

ఎయిడెడ్‌ విద్యా సంస్థల మ్యాపింగ్‌

కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గినా.. మరో దారిలో ముందుకు

అంగీకరించని వారిని బుజ్జగించైనా సరే దారికి తెచ్చేలా..

విద్యా సంవత్సరం ముగిసేలోగా విలీన యత్నాలు

డీఈవో పూల్‌లోకి 498 మంది టీచర్లు, ఇతర సిబ్బంది


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 13 : కోర్టు ఆదేశాల మేరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిలిపివేతపై వెనక్కి తగ్గినప్పటికీ ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలోకి విలీనం చేసే ప్రయత్నాలను మాత్రం విద్యాశాఖ కొనసాగిస్తూనే ఉంది. ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఎత్తివేతకు ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాం డెంట్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో, రాష్ట్రంలో ఏ ఒక్క ఎయిడెడ్‌ స్కూలును మూసే ఉద్దేశం గాని, వాటికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను నిలిపివేసే ప్రతిపాదనలు గాని లేవని విద్యాశాఖ ఉన్న తాధికారులు కోర్టుకు నివేదించింది. దీంతో సమస్య పరిష్కారమైన ట్టేనని అంతా అనుకుంటున్నప్పటికీ, తొలుత అనుకున్న లక్ష్యాన్ని సాధించేం దుకు మరో మార్గాన్ని విద్యాశాఖ ఎంచుకుంది. ఆ ప్రకారం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను కొనసాగిస్తూనే, ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తోంది.


తొలుత విలీనం ఇలా..

జిల్లాలో మొత్తం 317 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 17 వేల మంది బాల బాలికలు వివిధ తరగతుల్లో చదువుతున్నారు. ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలు 259, ప్రాథమికోన్నత 13, ఉన్నత పాఠశాలలు 45 ఉన్నాయి. వీటిలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ విద్యార్థులు వున్న పాఠశాలలను ఇప్పటికే మూసివేశారు. అన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో 594 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వంలోకి ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం చేసేందుకు విద్యాశాఖ తొలుత తెచ్చిన ప్రతిపాదనలు, ఒత్తిళ్లు, బెదిరింపుల మేరకు కోర్టు తీర్పు రాక ముందే 276 పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్‌లు విలీనానికి అంగీకారం తెలియచేస్తూ విద్యా శాఖకు గతంలోనే రాత పూర్వకంగా సానుకూలత వ్యక్తం చేశాయి. ఆ మేరకు ఇప్పటి వరకు జిల్లాలో విల్లింగ్‌ లెటర్లు ఇచ్చిన 276 పాఠశాలల నుంచి 498 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది డీఈవో పూల్‌లోకి వచ్చారు. ఇలా విలీనానికి అంగీకారం తెలిపిన 498 మందికి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో వున్న క్లియర్‌ వెకెన్సీల్లో స్థానాలను కేటాయించేందుకు ఈ నెలాఖరులోగా నిర్వహించనున్న టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ అనంతరం ఎయిడెడ్‌ సిబ్బందికి బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎయిడెడ్‌ టీచర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో స్థానాలు కేటాయించి నప్పటికీ, ఎయిడెడ్‌ విద్యార్థులకు బోధనకు విఘాతం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు డిప్యూటేషన్లపై సంబంధిత ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే టీచర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


అంగీకరించని వారిని బుజ్జగించైనా సరే 

విలీనానికి అంగీకరించని, కోర్టును ఆశ్రయించిన ఎయిడెడ్‌ పాఠశాలలు జిల్లాలో 41 ఉన్నట్టు విద్యా శాఖ గుర్తించింది. ఈ పాఠశా లల్లో 96 మంది టీచర్లు పనిచేస్తున్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను కొనసాగిస్తూనే ఈ పాఠశాలలను విలీనం చేసేందుకు సంబంధిత యాజ మాన్యాలు, కరస్పాండెంట్లను బుజ్జగించి, నచ్చ చెప్పైనా సరే ఎలాగోలా దారిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వైపు ఈ ప్రయత్నాలు చేస్తూనే, రెండో వైపు అన్ని ఎయిడెడ్‌ పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు దూరంలో వున్న ప్రభుత్వ పాఠశాలలను మ్యాపింగ్‌ చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు ఎయిడెడ్‌ విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేసేందుకు తదుపరి ప్రక్రియ చేపడుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం విద్యా సంవ త్సరం ముగిసేలోగా వీలైనన్ని ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రైవేటు పాఠశా లలుగా మార్చడంతోపాటు, వాటిలోని టీచర్లు, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థకు మంగళం పాడడానికి విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నది కొసమెరుపు.


వారి విలీనం.. వీరి పదోన్నతులకు నష్టం

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరి ఉపాధ్యాయులను ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, యూపీ హైస్కూళ్ళకు నియమించడం వల్ల ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ స్కూళ్ల ఎస్‌జీటీలకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఆప్టా) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ శివరామ్‌, పీఎల్‌వీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-10-14T05:08:51+05:30 IST