అన్నాడీఎంకేలో విలీనానికి దినకరన్ పావులు..

ABN , First Publish Date - 2020-10-02T15:42:30+05:30 IST

అక్రమార్జన కేసులో శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో వున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ కేంద్ర బిందువుగా అధికార అన్నాడీఎంకే, అమ్మామక్కల్‌

అన్నాడీఎంకేలో విలీనానికి దినకరన్ పావులు..

చెన్నై, : అక్రమార్జన కేసులో శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో వున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ కేంద్ర బిందువుగా అధికార అన్నాడీఎంకే, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీల మధ్య విలీనం దిశగా రహస్య చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని బీజేపీ పెద్దల ఆశీస్సులతో ఈ తెరచాటు మంతనాలు కొనసాగుతున్నాయి. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా అన్నాడీఎంకేలో అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం విలీనం జరిగితీరాలని బీజేపీ జాతీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. అంతే కాకుండా ఈ రెండుపార్టీలు విలీనమయ్యేందుకు బీజేపీ సీనియర్‌ నేతలు రహస్యంగా మధ్యవర్తిత్వం కూడా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ దిశగానే రాయపేట ప్రాంతంలో ఈ రెండు పార్టీలు ఊహించని విధంగా సందడి సృష్టించాయి. ఈ నెల 28న రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడే, అదే రాయపేటలో మరొక ప్రాంతంలో అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగిన విషయం ఎవరికీ తెలియదు. అన్నాడీఎంకే కార్యాలయం ఎంత సందడిగా మారిందో అంతే సందడి అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం సమావేశ ప్రాంతంలోనూ చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీల నేతలూ బీజేపీ జాతీయ నాయకులను కలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


బీజేపీ పిలుపుమేరకే దినకరన్‌ ఢిల్లీకి 

తొలుత అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత అన్నాడీఎంకే మంత్రులు తంగమణి, వేలుమణి ఢిల్లీ పయనమయ్యారు. దినకరన్‌, ఇద్దరు మంత్రులు వేర్వేరుగా ఢిల్లీలో తమకు అత్యంత సన్నిహితులైన బీజేపీ జాతీయ నాయకులను కలుసుకుని తిరిగి వచ్చారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే తెలియని విషయం మరొకటి ఉంది. గత కొద్ది నెలలుగా అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ‘సీక్రెట్‌మేన్‌’గా మారారు. దినకరన్‌ ఎప్పుడు ఎక్కడకు వెళతారో, ఎవరిని కలుసుకుంటారో అంతుబట్టని రహస్యంగా మారింది. గత ఐదు నెలలుగా పార్టీ శ్రేణులనుగానీ, పార్టీ ప్రముఖులు, నాయకులను గానీ కలవడమే లేదు. దినకరన్‌ ఎక్కడున్నారని పార్టీ సీనియర్‌ నాయకులను అడిగితే చెన్నై అడయార్‌ నివాసగృహంలో వున్నారని, పుదుచ్చేరి ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని, శశికళను కలుసుకునేందుకు బెంళూరుకు వెళ్ళారని తోచిన విధంగా  సమాధానమిస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన దినకరన్‌ రెండు మూడు రోజులు చెన్నైలోనే లేరు. ఆయన ఎక్కడకు వెళ్ళారో ఇంటెలిజెన్స్‌ విభాగానికి కూడా తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయమై మన్నార్‌గుడికి చెందిన దినకరన్‌కు సన్నిహితుడైన ఓ నాయకుడిని ప్రశ్నించినప్పుడు ‘బెంగళూరు వెళ్లే మార్గంలో హోసూరు సమీపంలో ఉన్న ఓచోట బసచేస్తున్నారని, శశికళ విడుదలకు సంబంధించి రాజకీయపరమైన చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అక్కడి నుండే చెన్నైలో వున్న పార్టీ సీనియర్‌ నేతలకు ఫోన్‌చేసి అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగే రోజునే అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం జిల్లా కార్యదర్శుల సమావేశం జరుపమంటూ ఆదేశాలిచ్చారు. చెన్నైలో జరిగే సమావేశానికి వస్తున్నారా అని దినకరన్‌ను అడిగినప్పుడు తాను చెన్నై రావటం లేదని, పార్టీలో వున్న సీనియర్‌ నేతలు పళనియప్పన్‌, వెట్రివేల్‌ అధ్యక్షతన జిల్లా కార్యదర్శుల సమా వేశాన్ని జరుపమంటూ బదులిచ్చారు. వెంటనే పార్టీ జిల్లా కార్యదర్శులందరికీ ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత రాయపేటలోనే అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన 35 జిల్లాలకు చెందిన కార్యదర్శుల సమావేశం అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడే నిర్వహించి ఆ పార్టీనేతలు కలకం సృష్టించారు. మరుసటి రోజు తక్కిన జిల్లా కార్యదర్శుల సమావేశం కూడా జరిపారు. దినకరన్‌కు బదులుగా మాజీ శాసనసభ్యుడు వెట్రివేల్‌ రాజధాని నగరం చెన్నైలో పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. దినకరన్‌ తర్వాత పార్టీలో అత్యంత పలుకుబడి కూడా వెట్రివేల్‌కు ఉంది. అందుకే దినకరన్‌ తాను నగరంలో లేనప్పుడు పార్టీ వ్యవహారాలను నిర్వహించే బాధ్యతను వెట్రివేల్‌కు అప్పగిస్తున్నారు. ఇలా దినకరన్‌కు వెట్రివేల్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్నప్పటికీ  దినకరన్‌ ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయం ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన దినకరన్‌ ఎవరెవరిని కలుసుకున్నారని, ఇదే విధంగా రాష్ట్ర మంత్రులు తంగమణి, వీరమణి ఏ నేతలతో భేటీ అయ్యారని ఆరా తీసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.


అమిత్‌షాతో భేటీకే...

అక్రమార్జన కేసులో అరెస్టయి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న శశికళను ముందుగా విడుదల చేయించే ప్రయత్నాలపై న్యాయనిపుణులను కలవడానికే దినకరన్‌ ఢిల్లీ వెళ్ళారని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు వెళ్లినట్టు తెలిసింది.. శశికళను ముందుగా విడుదల చేయడానికి ఎదురవుతున్న చిక్కులు గురించి, అధికార అన్నాడీఎంకేలో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు గురించి చర్చించేందుకు వెంటనే బయలుదేరి రమ్మని ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆదేశాలు రావడం వలనే దినకరన్‌ అప్పటికప్పుడు ప్రత్యేక విమానంలో బయల్దేరివెళ్లినట్టు తెలిసింది. దినకరన్‌ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమిత్‌షా హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దినకరన్‌ ఆయనను కలుసుకోలేక పోయారు. అమిత్‌షాకు సన్నిహితుడైన ఓ బీజేపీ నేతను కలుసుకోమని ఆ పార్టీ అధిష్టానం నుంచి సమాచారం రావడంతో ఆ నాయకుడి ఫోన్‌ ద్వారా అమిత్‌షాతో దినకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ ఆయన మాట్లాడారు. అదే సమయంలో ఢిల్లీలో వున్న రాష్ట్ర మంత్రులిద్దరూ కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను కలుసుకొని కొన్ని విషయాలపై చర్చలు జరిపి చెన్నైకి బయల్దేరి వెళ్ళారు.


విలీనం సాధ్యమేనా?

అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం అధికార అన్నాడీఎంకేలో విలీనం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకు సాధ్యమేనని రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతమున్న ద్వంద్వ నాయకత్వంతో పోటీకి దిగితే గెలుపు సాధ్యం కాకపోవచ్చుననే అనుమానం అన్నాడీఎంకే నాయకుల్లో ఉంది. ఈ విషయం ఢిల్లీలోని బీజేపీ నాయకుల దృష్టికి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లయినా గెలుచు కోవాలంటే అన్నాడీఎంకే పూర్వంలా పటిష్టంగా ఉండాలని అమిత్‌షా, జేపీ నడ్డా భావిస్తున్నారు. అదే సమయంలో శశికళ జైలు నుంచి విడుదలైతే అధికార పార్టీలోని కొందరు శాసనసభ్యులు అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగంలో చేరిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఈ కారణంగా అన్నాడీఎంకే నేతలంతా శశికళ విడుదలైనా అన్నాడీఎంకేలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎలాంటి మార్పులు సంభ వించవని ప్రకటిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అన్నాడీఎంకేలో ఎవరూ పార్టీ నుంచి విడిపోకుండా కాపాడుకోవాలంటే శశికళ నాయకత్వంలోని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగంను విలీనం చేసుకుంటే ఎలాంటి నష్టం రాదని, అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశముందని పార్టీనేతలంతా భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటిం చాలని మద్దతుదారులతో రహస్య మంతనాలు జరుపుతున్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు దినకరన్‌కు ఇంకా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. దినకరన్‌ అన్నాడీఎంకే నేతలుగానీ, మంత్రులుగానీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎదురైనప్పుడు మా చైర్మన్‌ (పన్నీర్‌సెల్వం) ఎలా వున్నారంటూ అడుగుతుంటారు. అంతే కాకుండా దినకరన్‌ మొదటి నుంచి పన్నీర్‌సెల్వంకు గట్టి మద్దతు ఇచ్చారని అన్నాడీఎంకే నేతలందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లోనే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేయడానికి తాను చైర్మన్‌ అంటూ గౌరవంగా పిలిచే పన్నీర్‌సెల్వం తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని దినకరన్‌ దృఢంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికీ జైలు నుంచి శశికళ విడుదలైన తర్వాత తమిళనాడు రాజకీయ చిత్రపటంలో పెనుమార్పులు తప్పవని తెలుస్తోంది.

Updated Date - 2020-10-02T15:42:30+05:30 IST