మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-17T04:00:22+05:30 IST

జిల్లాలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధిపరిచే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పలు కీలకచర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా జిల్లాలో మెజార్టీ మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు.

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

- జిల్లాలో మహిళా సంఘాలపై ఐటీడీఏ దృష్టి

- సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యచరణ 

- వివిధ రకాల యూనిట్లను ప్రారంభింపజేసేందుకు కసరత్తు

- ఇక్రిసాట్‌ సాంకేతిక సహకారంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

- ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌తో సత్తాచాటుతున్న మహిళలు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధిపరిచే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పలు కీలకచర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా జిల్లాలో మెజార్టీ మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్న వేళ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నేతృత్వంలో మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా పెద్దఎత్తున రుణాలను ఇవ్వనున్నారు. దీంతో ఒక్కొక్క సంఘాన్ని ఒక్కో యాక్టివిటిలో నిమగ్నం చేసి ఆర్థికంగా వారికి అవకాశాలును సృష్టించేందుకు కార్యచరణ తయారు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఆయా స్థల, కాల పరిస్థితులను బట్టి చిన్నచిన్న యూనిట్లను మంజూరు చేశారు. తాజాగా మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టేలా మహిళలను కార్యోర్ముకులను చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌ మహిళా సంఘాల స్వశక్తీకరణపై దృష్టి సారించి రానున్న ఏడాదిలో అమలు చేయబోతున్న కార్యచరణను సిద్ధం చేశారు. ఆయా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వివిధ రకాల తయారీ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేట్టు అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే మహిళల ఆధ్వర్యంలో సినిమా థియేటర్‌ నిర్మాణం విజయవంతంగా పూర్తిచేయగా, రెండేళ్ల క్రితం పట్టణ శివారులో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే గతేడాది కొవిడ్‌ కారణంగా ఆ యూనిట్‌ కార్యాకలపాలు మందగించినా ఈ యేడాది అధికారుల అంచనాలకు మించి ఉత్పతిని సాధించటమే కాకుండా వాటిని విజయవంతంగా ఐటీడీఏకు అందజేశారు. తద్వారా దాదాపు రూ.3.50 కోట్ల టర్నోవర్‌ సాధించారు. 

గిరి బ్రాండ్‌తో మల్టీ గ్రేయిన్‌ పౌడర్‌

ఆసిఫాబాద్‌ మండల సాలెగూడ శివారులో ఉన్న పట్టుపరిశ్రమల కేంద్రంలో ఏర్పాటు చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో మహిళా సంఘాల సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేసి మార్కెటింగ్‌ చేసే దిశగా కసరత్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా మూడు రకాల ఆహార పదా ర్ధాలను తయారు చేస్తుండగా భవిష్యత్తులో వీరిని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో జొన్నపిండి గిరిబాండ్‌తో మల్టీగ్రేయిన్‌ పౌడర్‌, స్వీట్‌ మీల్‌ బిస్కెట్ల తయారీ వంటివి ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులన్నింటిని ఉట్నూరు ఐటీడీఏ కొనుగోలు చేసి గిరిజన వసతిగృహాలు గర్భిణులకు పంపిణీ చేస్తోంది. సుమారు రూ.40లక్షల వ్యయంతో నెలకొల్పిన ఈ యూనిట్‌లో రూ.24లక్షలను ఐటీడీఏ సమకూర్చగా, రూ.10లక్షలను బ్యాంకు రుణంలో అందజేసింది. ఆరు లక్షలను సభ్యులు తమ వాటా ధనంగా చెల్లించారు. ఈ రూ.40లక్షలతో రెండేళ్ల క్రితం ఈ యూనిట్‌ ప్రారంభించగా ప్రతి రోజు సగటున 5నుంచి 7క్వింటాళ్ల ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఒక్క ఐటీడీఏ ద్వారానే ప్రతి పదిహేను రోజులకొకసారి రూ.11నుంచి రూ.15లక్షల చెల్లింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ యూనిట్‌ నెలకొల్పేందుకు అవసరమైన సాంతికేక సహకారాన్ని ఇక్రిశాట్‌ నిపుణులు అందజేస్తున్నారు. అంతేకాదు మార్కెటింగ్‌ మెళకువలు ఫుడ్‌ టెస్టింగ్‌ వంటి కీలక అంశాల్లోనూ ఇక్రిశాట్‌ ప్రతినిధులే సహకరిస్తున్నట్టు గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారులు చెబు తున్నారు. గడిచిన ఏడాదిలో సగటున ప్రతినెల రూ.30లక్షల చొప్పున దాదాపు రూ.3.50 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించగా ఖర్చులన్నీ పోను భారీగానే లాభం చేకూరిందని చెబుతున్నారు. ఈ విజయంతో గ్రామీణాభివృద్ధి శాఖ మరిన్ని విభిన్న తరహా యూనిట్లను నెలకొల్పాలని యోచిస్తోంది. ముఖ్యంగా వ్యాపార వృద్ధికి అవకాశాలు కలిగిన యూనిట్లను ఎంచుకునేలా మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వెల్లడించారు.

జిల్లాలో 7925 మహిళ సంఘాలు

ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 397 విలేజ్‌ ఆర్గనైజేషన్‌ ఉండగా, 7925 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో మొత్తం 86,234 మంది సభ్యులు ఉన్నారు. వీరికి గాను 2021 ఆర్థిక సంవత్సరంలో 168 కోట్ల బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలిప్పించగా, 2021-22 ఆర్థిక సంవత్సంలో మొత్తం రూ.170.28 కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించారు. మొత్తం 4900 సంఘాలకు మాత్రమే బ్యాంకు లింకేజీ కింద రుణాలు లభించగా మిగితా సంఘాలు చెల్లింపులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఇంకా రుణాల అర్హత సాధించలేదు. 

మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయాలన్నదే ధ్యేయం

-సురేందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 

జిల్లాలో ఉన్న 7900సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రతి మహిళను ఒక శక్తిగా మలచాలన్నదే తమ ధ్యేయం. ఇందుకు గాను రానున్న రోజుల్లో కొత్త తరహా యూనిట్ల ఏర్పాటుకు కార్యచరణ రూపొందించి అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం సినిమా థియేటర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విజయవంతం అయినందున ఒక్కొక్క యూనిట్‌తో వంద మందికి ఉపాఽధి కల్పించడమే లక్ష్యంగా దుస్తుల తయారీ, బ్రిక్స్‌ మేకింగ్‌, థియేటర్‌ ప్రాంగణంలో చిల్డ్రన్స్‌ గేమింగ్‌, షాపింగ్‌, ఇతర స్టాల్స్‌ ఏర్పాటు చేసి వందశాతం మహిళలే నిర్వహించే చర్యలు చేపట్టబోతున్నాం.

Updated Date - 2022-04-17T04:00:22+05:30 IST