Abn logo
Sep 20 2021 @ 23:11PM

పీఠంపై గురి!

ఎంపీపీ కుర్చీ కోసం క్యాంపు రాజకీయాలు

అధికార పార్టీలో కీలక నేతలపై ఒత్తిళ్లు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ రామభద్రపురం/భోగాపురం, సెప్టెంబరు20:

మండల పరిషత అధ్యక్ష పీఠాల కోసం పైరవీలు మొదలయ్యాయి. క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. గడువు తక్కువ ఉండడంతో సభ్యులు చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఏకపక్షంగా జరిగిన పరిషత ఎన్నికల్లో అధికార వైసీపీ అనేక మండలాల్లో కొలువుదీరే పరిస్థితి ఉంది. అక్కడక్కడ ప్రతిపక్షం బలమైన పోటీ ఇచ్చింది. మండల అధ్యక్ష పీఠాల కోసం మరింత డిమాండ్‌ ఏర్పడింది. వైసీపీ గెలిచిన చోట కూడా వర్గపోరు ఉండే మండలాల్లో తమకే పదవి కట్టబెట్టాలని కోరుతూ మండల స్థాయి కీలక నేతలు(ఎంపీటీసీలు) ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. అధ్యక్ష పీఠం దక్కేలా చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మండల స్థాయిలో ఇదివరకూ పదవులు చేపట్టిన వారు ఎక్కువగా పోటీ పడుతున్నారు. వారి విషయంలో ఎమ్మేల్యేలు, అధిష్టానం ఏవిధంగా వ్యవహరిస్తుందో చూడాలి. 

గజపతినగరం నియోజకవర్గపరిధిలోని బొండపల్లి మండలంలో 15 మండల ప్రాదేశికాలున్నాయి. అక్కడ వైసీపీకి 14 స్థానాలు వచ్చాయి. ఎంపీపీ పీఠం కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో బండారు బంగారమ్మకు ఎంపీపీ పీఠం అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత గతంలో పీఏసీఎస్‌ అధ్యక్షునిగా పనిచేసిన బి.రాజేరు,  మరో నేత సీహెచ చెల్లంనాయుడు ఎంపీపీ పీఠం కోసం పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సగం సగం పదవీకాలం మాదిరిగా ఒప్పందం జరగవచ్చునని చెబుతున్నారు.

శిబిరాల్లో అభ్యర్థులు

కొన్ని మండలాల్లో హోరాహోరీగా ప్రతిపక్ష టీడీపీ పోటీ ఇచ్చింది. సగం సగం సీట్లు సాధించింది. దీంతో ఎవరు ఎవరిని మభ్యపెట్టి తమ పరం చేసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంప్‌ రాజకీయాలు ప్రారంభ మయ్యాయి. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం మండలంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బాడంగి మండలంలో కూడా అధికార, ప్రతిపక్షాలు చెరి సగం స్థానాలు నిలబెట్టుకున్నాయి. సభ్యులను నిలబెట్టుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. భోగాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. 

ఇదిలా ఉండగా అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న మండలాల్లో కూడా చాలా చోట్ల శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎంపీపీ పీఠాల కోసం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితిలో పీఠం ఆశించిన సభ్యుడు పదవి దక్కని పక్షంలో చేజారిపోయే పరిస్థితి ఉండొచ్చు. దీనిని గుర్తించి ఎక్కడికక్కడ శిబిరాలు జరుగుతున్నాయి. ఈనెల 24 వరకూ ఈ ఉత్కంఠ తప్పదు. ఆ రోజు మండల పరిషత కార్యాలయాల్లో జరిగే ఎన్నికల సమయానికి సభ్యులు శిబిరాల నుంచి ఓటింగ్‌ కేంద్రానికి చేరుకోనున్నారు.  

ప్రత్యేక శిబిరానికి రామభద్రపురం ఎంపీటీసీలు

మండల పరిషత్‌ ఎన్నికల్లో విజేతలైన ఎంపీటీసీ సభ్యులను రహస్య ప్రాంతాలకు తరలించడం మొదలైంది. ఈ నెల 24న ఎంపీపీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పదవిని చేజెక్కించుకునే ఎత్తుగడలో నాయకులు నిమగ్నమయ్యారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా... ఒక స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 13 ఎంపీటీసీ స్థానాల్లో 6 చోట్ల తెలుగుదేశం, ఒక స్థానంలో తెలుగుదేశం మద్దతుతో ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు, 2 చోట్ల వైసీపీ రెబల్‌ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక సభ్యుడు అటు, ఇటు అయితే ఫలితం తారుమారవుతుందన్న భయం నేతల్లో ఉంది. దీంతో సభ్యులను సుదూర ప్రాంతాల్లో రహస్యంగా ఉంచారు. రెండు పార్టీలూ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. గెలుపొందిన సభ్యులతో బేరసారాలకు తావులేకుండా మొబైల్‌ ఫోన్లు కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి వారికి రాజభోగాలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సభ్యులను కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే మొదట బొబ్బిలి కోటకు తరలించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి కారులో రహస్య శిబిరాలకు తీసుకెళ్లారు. ఎంపీపీ పీఠం అధికార పార్టీకి దక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ కూడా ఆశలు వదులుకోకుండా ఒక్క సభ్యుడినైనా తమ వర్గంలోకి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా. వైస్‌ ఎంపీపీ పదవితోపాటు కొంత నగదు కూడా ఆ సభ్యుడికి ఇవ్వడానికి రాయబారాలు సాగిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళనలు మొదలయ్యాయి. మ్యాజిక్‌ ఫిగర్‌కు సరిపడే విధంగా 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా అధికార పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు అవకాశం ఉందన్న సమాచారంతో తమ సభ్యులను కాపాడుకోవడానికి టీడీపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉన్న తమ సభ్యులను నేరుగా ఎన్నిక జరిగే ప్రాంతానికి ఈ నెల 24వ తేదీన హాజరుపరచాలన్నదే వారి వ్యూహం. రామభద్రపురం ఎంపీపీ పీఠం ఎవరు దక్కించుకుంటా రన్నదానిపై చిక్కుముడి వీడడానికి ఈ నెల 24వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. 

భోగాపురంలో లాటరీనా?

భోగాపురం మండలంలో టీడీపీ పుంజుకోవడంతో రాజకీయ పరిణామాలు వాడివేడిగా మారాయి. చాలా మండలాలల్లో ఎంపీపీ పీఠం ఏ పార్టీది అనేది ఓట్ల లెక్కింపురోజే ఓ అంచనా వచ్చేసింది. భోగాపురం మండలంలో మాత్రం ఉత్కంఠగా మారింది.  ఈ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను గూడెపువలస ఎంపీటీసీ అభ్యర్థి పోలింగ్‌కు ముందు మృతిచెందడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే సవరవల్లి ఎంపీటీసీ వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దీంతో మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. వీటిలో టీడీపీకి 7, వైసీపీకి 7 వచ్చాయి. వైసీపీ ఖాతాలో పడిన ఎంపీటీసీ అభ్యర్థుల్లో చేపలకంచేరు ఎంపీటీసీ అభ్యర్థి ఇటీవల మృతి చెందాడు. దీంతో టీడీపీ 7, వైసీపీ 7(ఏకగ్రీవంతో కలిపి) ఎంపీటీసీల అభ్యర్థులతో సమానంగా ఉన్నారు. ఎంపీపీ పీఠం దక్కాలంటే 14 ఎంపీటీసీల్లో కనీసం 8 ఎంపీటీసీలు ఉండి తీరాలి.  వైసీపీకి టీడీపీ వారు లేదంటే టీడీపీకి వైసీపీ వారు ఒకరు మద్దతు తెలిపితే ఎంపీపీ పీఠం ఖరారవుతుంది. లేదంటే లాటరీ కీలకమవుతుంది. ఈనెల 24న నిర్వహించబోయే ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మండలంలో ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.