1700 మంది ఉద్యోగులకు ఎయిర్ కెనడా ఉద్వాసన..

ABN , First Publish Date - 2021-01-15T00:15:17+05:30 IST

మహమ్మారి కరోనా వల్ల తీవ్ర నష్టాలను చవిచూసిన రంగాలలో విమానయానం ఒకటి.

1700 మంది ఉద్యోగులకు ఎయిర్ కెనడా ఉద్వాసన..

ఒట్టావా: మహమ్మారి కరోనా వల్ల తీవ్ర నష్టాలను చవిచూసిన రంగాలలో విమానయానం ఒకటి. అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం కొనసాగుతుండడం, స్వదేశీ విమానాల ద్వారా ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అన్ని దేశాల విమాన సంస్థలకు కోలుకోని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా 1,700 మంది ఉద్యోగులను తొలగించినట్లు బుధవారం ప్రకటించింది. మహమ్మారి కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా భారంగా మారిందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అలాగే కరోనా నిబంధనలతో తమ కష్టాలు రెట్టింపు అయ్యాయని వాపోయారు. గతవారం కెనడా ప్రభుత్వం ఐదేళ్లకు పైబడిన వారు ఎవరైనా విమానంలో ప్రయాణించాలంటే 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలనే నిబంధన పెట్టింది. దీంతో పాటు క్వారంటైన్ నిబంధనలను కూడా కఠినతరం చేసింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టికెట్ బుకింగ్స్‌ కూడా తగ్గిపోయాయని బుధవారం నాటి తన ప్రకటనలో ఎయిర్ కెనడా పేర్కొంది. అందుకే తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ కెనడా తెలిపింది.      

Updated Date - 2021-01-15T00:15:17+05:30 IST